Share News

ఎన్డీఏ సభ్యుల నిరసన.. వైసీపీ చేసింది తప్పేనన్న ఛైర్మన్

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:45 AM

ఏపీ శాసనమండలిలో వైసీపీ చేసింది మహాపచారం అంటూ ఛైర్మన్ ఛాంబర్‌ వద్ద ఎన్డీఏ సభ్యులు నిరసనకు దిగారు. హిందూమతాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఛైర్మన్‌కు తెలిపారు కూటమి సభ్యులు.

ఎన్డీఏ సభ్యుల నిరసన.. వైసీపీ చేసింది తప్పేనన్న ఛైర్మన్
AP Legislative Council

అమరావతి, ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద ఎన్డీఏ సభ్యులు(NDA) నిరసనకు దిగారు. మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో వైసీపీ సభ్యులు చేసిన మహాపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు హిందూమతాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఛైర్మన్‌కు తెలియజేశారు. ఇలాంటి చర్యను ఛైర్మన్‌గా మీరెలా అంగీకరిస్తారని ఎన్డీఏ సభ్యులు నిలదీశారు. దీనిపై స్పందించిన శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు.. వైసీపీ చేసింది తప్పేనని స్పష్టం చేశారు.


వైసీపీ సభ్యులను పిలిచి మాట్లాడతానని ఛైర్మన్ తెలిపారు. అయితే బహిరంగంగా క్షమాపణలు చెప్పించి, లెంపలేసుకునేలా చర్యలు తీసుకోవాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. నిరసనలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, స్వామి, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర తదతరులు పాల్గొన్నారు.


కాగా, నేడు ఏపీ శాసనమండలిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వేంకటేశ్వరస్వామి ఫొటోలు, ప్లకార్డులతో ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి నిరసన చేపట్టారు. వైసీపీ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారని.. వైసీపీ సభ్యులకు బుద్ధుందా? అని ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో ఛైర్మన్.. సభను వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి...

అమరావతిలో పోలీసుల క్రికెట్ పోటీలు.. పాల్గొన్న హోం మంత్రి అనిత

మండలిలో తీవ్ర గందరగోళం.. దేవుడి ఫొటోలతో వైసీపీ నిరసన.. సభ వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 12:51 PM