Share News

మండలిలో తీవ్ర గందరగోళం.. దేవుడి ఫొటోలతో వైసీపీ నిరసన.. సభ వాయిదా

ABN , Publish Date - Feb 20 , 2026 | 10:44 AM

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో వేంకటేశ్వరుడి ఫొటోలతో నిరసనకు దిగారు. వైసీపీ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండలిలో తీవ్ర గందరగోళం.. దేవుడి ఫొటోలతో వైసీపీ నిరసన.. సభ వాయిదా
AP Legislative Council

అమరావతి, ఫిబ్రవరి 20: వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు సభను కాసేపు వాయిదా వేశారు. ఈ రోజు(శుక్రవారం) శాసనమండలి మొదలైన వెంటనే వైసీపీ రెండు వాయిదా తీర్మానాలు ఇచ్చింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఈ తీర్మానాలిచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, మంగమ్మలు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చిన ఈ తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వారు ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకుని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు.


సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి ఫొటోలతో రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వేంకటేశ్వర స్వామి ఫొటోలతో నిరసన తెలపడంపై అభ్యంతరం తెలిపిన ఆయన.. దేవుడి ఫొటోలను పట్టుకుని నిరసనకు దిగడం అనైతికమన్నారు. సభలో దేవుడి చిత్రాలను అనుమతించవద్దని మంత్రి కోరారు.


'వైసీపీ సభ్యులకు బుద్ధుందా?'

‘దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు.. వైసీపీ సభ్యులకు బుద్ధుందా? ఇలాంటి దుర్మార్గపు చర్యలను అనుమతించకూడదు. వైసీపీ సభ్యులకు దేవుడంటే భయం లేదు, నమ్మకం లేదు. వైసీపీ సభ్యులంతా వారి నాయకుడు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. హిందూ గౌరవం, జాతి నమ్మకాన్ని తగ్గించడం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గమైన చర్యలను ఎట్టిపరిస్ధితుల్లోనూ అనుమతించవద్దు’ అని మంత్రి పయ్యావుల కోరారు. చెప్పులు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫొటోలను ఎలా పట్టుకుంటారని పలువురు మంత్రులు ప్రశ్నించారు. పోడియంను చుట్టుముట్టి వైసీపీ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి...

గోదావరి నది పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత: మంత్రి నిమ్మల

అమరావతిలో పోలీసుల క్రికెట్ పోటీలు.. పాల్గొన్న హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 11:09 AM