కుప్పంలో ప్రపంచ స్థాయి న్యూట్రిషన్ ప్లాంట్
ABN , Publish Date - Feb 20 , 2026 | 10:32 AM
కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రూ.వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
రూ.786 కోట్లతో వెయ్యి మందికి ఉపాధి
చిత్తూరు: కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. కుప్పం(Kuppam) పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రూ.వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రపంచ స్థాయి న్యూట్రీషన్ ప్లాంట్‌ను సరికొత్త ప్రాసెసింగ్ టెక్నాలజీతో కుప్పంలో ఏర్పాటు చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో 35 ఏళ్ల అనుభవంతో రోజుకు 5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తున్న ‘ఏసీఈ ఇంటర్నెషనల్ లిమిటెడ్’ సంస్థ ఇప్పుడు కుప్పంలో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. బుధవారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ‘రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు’ (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.29,018 కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమల్ని ఆమోదించారు. అందులో భాగంగానే రూ.786.15 కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి ఉపాధి లక్ష్యంతో ఏర్పాటు చేయనున్న ఈ సంస్థకూ ఆమోదం లభించింది.
ఆసియాలోనే సరికొత్త టెక్నాలజీ..
కుప్పంలో ఏర్పాటు చేయనున్న యూనిట్ ద్వారా ఆసియా మార్కెట్‌కు కొత్త డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీను తీసుకురానున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా పాడి ఉత్పత్తుల నాణ్యత, పోషక విలువలు, భద్రతా ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండేలా చూడొచ్చు. ఇది కేవలం పాల ఉత్పత్తుల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా చిన్న పిల్లలు, పెద్దల ఆరోగ్యానికి ఉపయోగపడే డెయిరీ న్యూట్రీషన్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా లభించే ప్రాంతం కావడంతో పాటు మంచి లాజిస్టిక్స్ సదుపాయాలు ఉండడం వల్ల కుప్పాన్ని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ దేశాలకు ఎగుమతులు చేస్తున్న ఈ కంపెనీ.. త్వరలో దక్షిణాసియా, ఆఫ్రికా, అమెరికా మార్కెట్లకు విస్తరించాలన్న లక్ష్యంతో ఉంది.
ఇవీ ఉత్పత్తులు
ప్రపంచ ఆహార, పోషకాహార కంపెనీలకు అవసరమైన స్పెషలైజ్డ్ న్యూట్రీషన్ ఇంగ్రిడియెంట్స్‌ను ఇక్కడ తయారు చేయనున్నారు. శిశు పోషకాహారం, స్పోర్ట్స్- మెడికల్ న్యూట్రీషన్, వే ప్రొటీన్, పాల పొడి, నెయ్యి, బటర్ ఫ్యాట్, ఫంక్షనల్- ఫోర్టిఫైడ్ పౌడర్లు, విటమిన్స్- మినరల్స్- ఫైబర్ కలిసిన న్యూట్రీషన్ ఫార్ములేషన్స్. ఇవన్నీ పెద్ద ఫుడ్, న్యూట్రీషన్ కంపెనీలకు సరఫరా అవుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
సాక్షి మీడియా పై రూ.100 కోట్ల పరువు నష్టం వేసిన హెరిటేజ్..
Read Latest Telangana News and National News