ఏ-6 ఉదయ్‌పై అంత ప్రేమెందుకో!
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:42 AM
వివేకా హత్య కేసులో ఏ-6గా ఉన్న గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిపై యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్)కు ఎందుకంత ప్రేమని వివేకా కుమార్తె సునీతారెడ్డి ప్రశ్నించారు.
495 రోజులు విధులకు రాకున్నా.. ఉద్యోగం నుంచి తొలగించరా?
యూసీఐఎల్ జీఎంకు వివేకా కుమార్తె ప్రశ్న
కడప, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): వివేకా హత్య కేసులో ఏ-6గా ఉన్న గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిపై యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్)కు ఎందుకంత ప్రేమని వివేకా కుమార్తె సునీతారెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆమె కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్‌ను కలిశారు. అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. ‘ఉదయ్‌కుమార్‌రెడ్డి 495 రోజులు విధులకు హాజరు కాలేదు. ప్రభుత్వ సెక్టారులో పనిచేసే ఉద్యోగులు అరెస్టయి రిమాండుకు వెళ్తే.. వారిని సస్పెండ్ చేయడం గానీ, విధుల నుంచి తొలగించడం గానీ చేస్తారు. కానీ దాదాపు 500 రోజులు ఉదయ్ విధులకు రాకపోయినా.. తొలగించలేదు. ఉదయ్‌కు ఎవరు వెనక నుంచి సపోర్టు చేస్తున్నారో తెలియడం లేదు. దీనిపై సీఎం చంద్రబాబును కలిసి వివరిస్తాం’ అని సునీత తెలిపారు.