వైద్య విద్యలో యువతుల ముందంజ.. సీఎం చంద్రబాబు హర్షం
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:46 PM
ఏపీలో వైద్య విద్యలో యువతులు ఎక్కువ సీట్లు దక్కించుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యారంగంలో యువతులు ముందుండటం గర్వకారణమన్నారు.
అమరావతి, నవంబర్ 19: ఏపీలో వైద్య విద్యలో యువతులు ఎక్కువ సీట్లు దక్కించుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యారంగంలో యువతులు ముందుండటం గర్వకారణమన్నారు. రాష్ట్ర కోటా కింద కేటాయించిన మొత్తం ఎంబీబీఎస్ సీట్లలో 61.34 శాతం సాధించి, 38.66 శాతం వాటా కలిగిన పురుష విద్యార్థులను అధిగమించిన విద్యార్థినులకు అభినందనలు తెలియజేశారు. ఇది వారి ప్రతిభ, పట్టుదల, పెరుగుతున్న ఆకాంక్షలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ కలలు కనడానికి, సాధించడానికి, నాయకత్వం వహించేందుకు సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
ఏపీలో ఎంబీబీఎస్ సీట్లలో అమ్మాయిలదే పైచేయి
2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలో రాష్ట్ర కోటా ఎంబీబీఎస్ (MBBS) సీట్లలో 61.34 శాతం సీట్లను విద్యార్థినిలు కైవసం చేసుకున్నారు. రాష్ట్ర కోటా కింద ఉన్న మొత్తం 6,937 ఎంబీబీఎస్ సీట్లలో 6,929 సీట్లు భర్తీ కావడంతో 99.88 శాతం అడ్మిషన్లతో ప్రవేశాల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. మొత్తం రాష్ట్ర కోటా సీట్లలో అమ్మాయిలు 4,250 సీట్లు (61.34%) సాధించగా, అబ్బాయిలు 2,679 సీట్లు (38.66%) పొందారు. కన్వీనర్ కోటాలోని మొత్తం 4,581 సీట్లు (ప్రభుత్వ కళాశాలల్లో 2,631, ప్రైవేట్ కళాశాలల్లో 1,950) పూర్తిగా భర్తీ అవగా.. ఇందులో 62.39 శాతం సీట్లను విద్యార్థినిలే దక్కించుకున్నారు. మేనేజ్మెంట్ కోటాలో 2,356 సీట్లకు గానూ 2,348 సీట్లు భర్తీ కాగా, ఇందులోనూ 59.28 శాతంతో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది.
ఏపీలోని మొత్తం 7,465 ఎంబీబీఎస్ సీట్లలో 528 సీట్లను ఆల్ ఇండియా కోటాకు కేటాయించారు. ఎన్ఎంసీ (NMC) అనుమతితో నిర్వహించిన స్పెషల్ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్‌లో మిగిలిన 69 ఎన్ఆర్ఐ (NRI) కేటగిరీ సీట్లలో 61 భర్తీ కాగా, కేవలం 8 సీట్లు మాత్రమే ఖాళీగా మిగిలాయి. పాడేరు, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మిగిలిన సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లుగా మార్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కొత్తగా ఏర్పాటైన పిడుగురాళ్ల వైద్య కళాశాలలోని 22 కన్వీనర్ కోటా సీట్లు మూడో విడత కౌన్సెలింగ్ నాటికే పూర్తిగా నిండిపోయాయి. తుది అడ్మిషన్ల నివేదికను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (NTRUHS) సమర్పించింది.
ఇవి కూడా చదవండి...
జగన్ అక్రమాస్తుల కేసు.. స్టేటస్ రిపోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
Read latest Telangana News And Telugu News