Share News

విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్లపై సీఎం చంద్రబాబు ఫోకస్

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:43 PM

ఏపీలో విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్‌ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ మూడు రీజియన్లల్లో చేపట్టిన ప్రణాళికలు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల గ్రౌండింగ్ వంటి అంశాలపై సీఎంకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు.

విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్లపై సీఎం చంద్రబాబు ఫోకస్
CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 19: రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్‌ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ మూడు రీజియన్లల్లో చేపట్టిన ప్రణాళికలు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల గ్రౌండింగ్ వంటి అంశాలపై సీఎంకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలకు పెద్దపీట వేసింది. అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్ రంగాల్లో అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేసింది. మూడు ఆర్థిక ప్రాంతాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.


విశాఖ ఎకనమిక్ రీజియన్-VER పరిధిలో వివిధ శాఖల్లో 167 అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించగా.. ఇప్పటికే 64 పనులను సర్కార్ ప్రారంభించింది. VERకు యాంకర్ ప్రాజెక్టుగా వైజాగ్ బే సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్ హబ్‌ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. విశాఖలో స్టీల్ సిటీ, కాకినాడ ఇండస్ట్రియల్ సిటీ, పోర్టుల విస్తరణకు ప్రణాళికలు రూపొందింది. విశాఖలో 15–20 కొత్త ఐటీ సంస్థలను ఆకర్షించడంతో పాటు ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా 2 లక్షల ఉద్యోగాల హామీని కార్యరూపంలోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.


తీర ప్రాంత అభివృద్ధి, కోనసీమ బ్యాక్ వాటర్స్ అభివృద్ధిపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. అరకు, మారేడుమిల్లి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, స్పేస్, ఎయిర్ క్రాఫ్ట్, ఆటో, ఈవీ, డిఫెన్స్, టూరిజం, నాలెడ్జ్ రంగాలకు కేంద్రంగా తిరుపతి ఎకనమిక్ రీజియన్-TER అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది. ఏపీలోని 87 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో TER పరిధిలో 66 ప్రాజెక్టులకు పెట్టుబడులు ఉండటం ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యంగా మారింది. హార్టికల్చర్ హబ్‌లో భాగంగా డెయిరీ ప్రాసెసింగ్, మీట్ అండ్ పౌల్ట్రీ, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, టెర్మినల్ మార్కెట్లు వంటి క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు.


తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలోని 14 పట్టణాలను వివిధ రంగాల వారీగా పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి ఆర్థిక ప్రాంతంలో 48 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులను గ్రౌండింగ్ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణం పూర్తి చేసి ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధి, లాజిస్టిక్స్ రంగానికి ఊతమిచ్చేలా చర్యలు చేపట్టింది. కోస్టల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా సూర్యలంక, ఓడరేవు, రామాపురం, చినగంజాం, నిజాంపట్నం, దిండి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.


ఇవి కూడా చదవండి...

ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుపాను.. 24 నుంచి 36 గంటలు అప్రమత్తం

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Read latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 01:43 PM