ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Nov 19 , 2026 | 11:22 AM
ఆంధ్రప్రదేశ్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారిక ప్రకటన జారీ చేశారు.
విజయవాడ, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు (గురువారం) మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారిక ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలోని 25 జిల్లాల పరిధిలోని ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ విడతలో ఆయా గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు, సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ నెల 13న మొదటి విడత, 16న రెండో విడత నోటిఫికేషన్లు విడుదలై ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.
ఎన్నికల షెడ్యూల్
నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1లో ఎన్నికల నోటీసు జారీ చేయడంతో పాటు వార్డు వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు.
నవంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ(ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు)
నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన (ఉదయం 8:00 గంటల నుంచి)
నవంబర్ 25న తిరస్కరణకు గురైన నామినేషన్లు సంబంధిత ఆర్డీఓ వద్ద అప్పీలు (సాయంత్రం 5:00 గంటల వరకు)
నవంబర్ 26న అప్పీలేట్ అధికారులు ఆయా అప్పీళ్లపే పరిష్కరిస్తారు
నవంబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ (మధ్యాహ్నం 3:00 గంటల వరకు గడువు)
నవంబర్ 27న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ (మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత)
డిసెంబర్ 2న పోలింగ్ (ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు)
డిసెంబర్ 2న పోలింగ్ ముగిసిన రోజునే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన (డిసెంబర్ 2 మధ్యాహ్నం 2:00 గంటల నుంచి)
ఫలితాలు వెలువడిన రోజే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ ఆరోజు వీలుకాకపోతే సెలవు దినమైనా మరుసటి రోజు తప్పనిసరిగా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే డిసెంబర్ 3న ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు.
నిబంధనలు & జిల్లాల వివరాలు
కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నా, పరిపాలనా, న్యాయపరమైన అడ్డంకులు ఉన్న ఆయా పంచాయతీలు లేదా పదవులకు ఎన్నికల నోటీసు జారీ చేయవద్దని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రీపోలింగ్ జరిగిన పంచాయతీల్లో రీపోలింగ్ ఫలితాల ప్రకటన తర్వాతే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని స్పష్టం చేసింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లోని పలు మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.
తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్.టి.ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల్లో పోలింగ్ జరగనుంది.
మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వై.ఎస్.ఆర్.కడప, అనంతపురము, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు మండలాలకు నోటిఫికేషన్ వర్తిస్తుంది.
ఇవి కూడా చదవండి...
పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి
ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుపాను.. 24 నుంచి 36 గంటలు అప్రమత్తం
Read latest AP News And Telugu News