రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్, లోకేశ్
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:13 AM
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా నేతలు విషెస్ తెలియజేశారు.
అమరావతి, నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా నేతలు విషెస్ తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన దేశానికి దిశానిర్దేశం చేసింది భారత రాజ్యాంగమని సీఎం అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం విలువలతో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం పునాది వేసిందని తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో విశిష్ట పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.
దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన రాజ్యాంగ నిర్మాతలందరికీ సీఎం ఘన నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ, నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తిద్దామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ముందుకు సాగుదామని.. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సుపరిపాలన లక్ష్యాలుగా పనిచేద్దామంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
రాజ్యాంగం మన హక్కులకు రక్షణ కవచం: పవన్
రాజ్యాంగం అనేది ఒక దేశాన్ని నిర్వచించే పత్రం మాత్రమే కాదని.. అది ప్రజల గౌరవాన్ని, హక్కులను, ఆకాంక్షలను కాపాడే ఒక వాగ్దానమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్యానికి పునాది అయిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిద్దామని చెప్పుకొచ్చారు. ‘రాజ్యాంగం మన హక్కులకు రక్షణ కవచం, అలాగే మన బాధ్యతలను గుర్తుచేసేది. దాని విలువలను గౌరవిద్దాం, మన ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేద్దాం. సమ్మిళిత, ప్రగతిశీల భారత్‌ను నిర్మించే దిశగా చిత్తశుద్ధితో, నిబద్ధతతో మన విధులను నిర్వర్తిద్దాం’ అంటూ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం రాజ్యంగం: మంత్రి లోకేశ్
భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా అందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం మన రాజ్యాంగం. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, వాటి పరిరక్షణకు మనమంతా కట్టుబడి ఉండాలి. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డా. బి.ఆర్. అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ నిర్మాతలందరి కృషిని స్మరించుకుందాం’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
Read Latest AP News And Telugu News