పొత్తు ధర్మం పాటించాల్సిందే.. రెబల్స్‌ను సస్పెండ్ చేయండి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:50 PM
పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే అని.. ఇందులో రెండో ఆలోచనకు ఆస్కారం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
అమరావతి, అక్టోబర్ 29: పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే అని.. ఇందులో రెండో ఆలోచనకు ఆస్కారం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ‘అభ్యర్థిని కాదు.. ఎన్డీఏను చూసి ఓటు వేయాలి’ అని అన్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రెబెల్స్‌పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, తాను కలిసి సీట్ల సర్దుబాటు చేశామన్నారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరామని తెలిపారు. మంచి సందేశాన్ని ప్రజలు, అభ్యర్థులు, పార్టీ కేడర్, నేతలకు పంపామన్నారు.
ఈ రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలలో మంచి సానుకూలత ఉందని సీఎం తెలిపారు. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న పవన్ కల్యాణ్.. ముగ్గురం కూర్చుని మంచి మెసేజ్ ఇచ్చామని అన్నారు. ప్రజలు, పార్టీ కేడర్ నుంచి కూడా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. జనసేన, బీజేపీ నుంచి ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిస్కరిస్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
పార్టీ తరఫున ఎక్కడైనా రెబల్స్ ఉంటే వెంటనే వాళ్లను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వాళ్లు పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టే భావించాలన్నారు. మంత్రులు తమ నియోజకవర్గాలతో పాటు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న జిల్లాలపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ‘అభ్యర్థుల గెలుపు బాధ్యత మీదే’ అని మంత్రులకు స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు పూర్తైన తరువాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆ వెంటనే సొసైటీ ఎన్నికలు కూడా ఉంటాయని తెలిపారు. ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత మొత్తం పాలనపై దృష్టి పెడదామని సమావేశంలో అన్నారు. ఈ ఎన్నికలలో ఎక్కడైనా వివాదాలు ఉంటే వెంటనే సెటిల్ చేయాలని మంత్రులను కోరారు. ఆ తర్వాత మాత్రం ఎవరినీ ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఆర్నబ్ తుఫాన్ వేళ నిద్రాహారాలు మాని పనిచేశారు.. మంత్రి లోకేశ్ ప్రశంసలు
ఆర్నబ్ తుఫాన్‌పై అమిత్ షా సమీక్ష.. త్వరలోనే బాధిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
Read Latest AP News And Telugu News