Share News

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఎప్పుడూ కలిసే సాగాలి: చంద్రబాబు

ABN , Publish Date - Mar 28 , 2026 | 08:17 PM

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయూ జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో పాత్రికేయుల నివాసాల కోసం భూమి కేటాయించేందుకు సానుకూలంగా పరిశీలిస్తామని భరోసానిచ్చారు.

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఎప్పుడూ కలిసే సాగాలి: చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 28: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్‌లో ప్రెస్ క్లబ్‌లకు, జర్నలిస్టులకు విలువైన ప్రాంతాల్లో భూములిచ్చామన్నారు. అమరావతిలోనూ పాత్రికేయుల నివాసాల కోసం భూమి కేటాయించేందుకు సానుకూలంగా పరిశీలిస్తామని భరోసానిచ్చారు. మండల రిపోర్టర్లకు అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించడం సహా జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని పది లక్షల రూపాయలకు పెంచామని.. డెస్క్ జర్నలిస్టులకు, సబ్ ఎడిటర్లకూ అక్రిడిటేషన్, బస్సు ప్రయాణ రాయితీలు కల్పించామని చెప్పుకొచ్చారు.


'అమరావతిలో భూమి మానిటైజేషన్ ప్రాజెక్ట్ అయినప్పటికీ.. ఓ పద్ధతి ప్రకారం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకుంటాం. గతంలో కేవలం కమ్యూనిస్ట్ పార్టీలే తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవడానికి సొంత పత్రికలను కలిగిఉండేవి. కానీ.. నేడు రాజకీయ నాయకులే స్వయంగా మీడియా సంస్థలను నడుపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన ధోరణి. వృత్తిపరమైన మీడియా, రాజకీయ పార్టీల యాజమాన్యంలోని మీడియాల మధ్య స్పష్టమైన తేడా ఉండాలని నేను కోరుకుంటున్నాను' అని చంద్రబాబు పేర్కొన్నారు.


నేటి కాలంలో సోషల్ మీడియా ఓ పెద్ద సవాలుగా మారిందని సీఎం అన్నారు. కొందరు వ్యక్తులు కేవలం అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచారం చేయడానికి, ఇతరుల వ్యక్తిత్వ హననం చేయడానికే సామాజిక మాధ్యమాలను వాడుతున్నారని మండిపడ్డారు. 'తప్పుడు ప్రచారాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరం. దీనిని ఎలా నియంత్రించాలో, ప్రజలను ఎలా చైతన్యపరచాలో మనమందరం ఆలోచించాలి. రాబోయే ఒకటి రెండేళ్లలో 3వ స్థానానికి, 2038 నాటికి 2వ స్థానానికి, 2047 లేదా 2050 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదిగే అవకాశముంది' అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.


ఐదు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని ఈ సందర్భంగా స్మరించుకున్నారు చంద్రబాబు. కరెంటులేక పొలాలు ఎండిపోతున్నాయని తాను అసెంబ్లీని వాయిదావేసి మరీ క్షేత్రస్థాయికి వెళ్లిన రోజులు గుర్తున్నాయన్నారు. '​​90వ దశకం చివరలో నేను విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాను. దేశం కోసం, రాష్ట్రం కోసం నేను విద్యుత్ తీసుకొచ్చినా.. దురదృష్టవశాత్తూ 2004లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఎప్పుడూ కలిసే సాగాలి. నేడు సమాజంలో విలువలు పడిపోవడం, సిద్ధాంతాలు మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీ.రామారావును ఒకసారి 'మీరు కమ్యూనిజమా, సోషలిజమా లేక క్యాపిటలిజమా?' అని అడిగితే.. తానొక 'ఉత్తమ మానవతావాదిని' అని ఆయన సమాధానమిచ్చారు' అని ముఖ్యమంత్రి నాటి జ్ఞాపకాలను గురించి వివరించారు.


హైదరాబాద్ అభివృద్ధి గురించి ఏపీ సీఎం మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామంటే నాడు అందరూ నవ్వుకున్నారు. కానీ పాతికేళ్ల తర్వాత నేడు తెలంగాణ తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్లలో 25 శాతం హైదరాబాద్‌కే వస్తున్నాయి. రాష్ట్ర విభజన కంటే కూడా 2019 నుంచి 2024 మధ్య జరిగిన విధ్వంసం వల్లే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయింది. మళ్లీ మనం అశ్రద్ధ చేస్తే, సమస్యలు వస్తాయనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మూడు రాజధానులని మాట్లాడారు. కొంతవరకు మీడియా అంతా కూడా దీనిని ఖండించారు, అయినా పట్టించుకోలేదు' అని చెప్పారు చంద్రబాబు.


ఇవీ చదవండి:

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

ఇకపై రాజధాని అమరావతికి ఇబ్బందులు ఉండవు: సీఎం చంద్రబాబు

Updated Date - Mar 28 , 2026 | 08:17 PM