Share News

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 03:01 PM

అమరావతి కోసం రైతులు 1631 రోజుల పాటు పోరాడారని హోంమంత్రి అనిత అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలం జరిగిన పోరాటం ఇది అని తెలిపారు.

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు
Home Minister Anitha

అమరావతి, మార్చి 28: అమరావతి శాతకర్ణి పాలనలో మహిళలకు ఎంతో గౌరవం దక్కిందని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) అన్నారు. శాసనసభలో హోంమంత్రి మాట్లాడుతూ... అమరావతిని వైసీపీ వారు ‘వేశ్యల రాజధాని’ అని అవమానకరంగా వ్యాఖ్యానించడం ఎంతో బాధించిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు 1631 రోజుల పాటు పోరాడారని తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘ కాలం జరిగిన పోరాటం అని వివరించారు. ఈ ఉద్యమంలో చంటి బిడ్డలను ఎత్తుకుని, గర్భిణిలు, వృద్ధ మహిళలు కూడా రోడ్డుపైకి వచ్చి పోరాడారని హోంమంత్రి గుర్తు చేశారు.


ఆనాటి రైతులు చేసిన ఆ మహా పోరాటాన్ని కొనసాగించేలా ఈనాటి అసెంబ్లీ తీర్మానం ఉంటుందని అనిత అన్నారు. అమరావతిని కాపాడుకున్న ఈ చరిత్ర భావితరాలకు తెలియాలన్నారు. ఉద్యమ సమయంలో మహిళలపై పోలీసులు దాడి చేశారని, వారిని కొట్టారని, జుట్టు పట్టుకుని లాక్కెళ్లారని, బూటుకాళ్లతో తన్నారని హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకుని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. మహిళలు కట్టుకున్న చీరలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని అనిత ఆరోపించారు.


మహిళల పోరాటానికి మద్దతు ఇచ్చిన వారి ఆర్థిక మూలాలను దెబ్బతీశారని హోంమంత్రి మండిపడ్డారు. రైతులు పాదయాత్రలో భోజనం చేసే సమయంలో టెంట్లు కూల్చివేశారన్నారు. దీంతో మట్టిలో, రోడ్లపై కూర్చుని రైతులు అన్నం తినాల్సిన దారుణ పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. ఇలాంటి అనేక దారుణాల నుంచి అమరావతిని మళ్లీ సాధించుకున్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అమరావతికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా రైతుల ఉద్యమాన్ని గుర్తు చేసుకుని ఈరోజు అసెంబ్లీలో అమరావతి తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ దిమ్మెల ధ్వంసం

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 28 , 2026 | 03:19 PM