సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:36 AM
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. శాసనసభలో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు.
అమరావతి, మార్చి 28: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం(AP Assembly Session) ఈరోజు(శనివారం) ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టారు. ఉదయం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు శాసనసభలో ఈ బిల్లును సీఎం ప్రవేశపెట్టడంతో తీర్మానంపై చర్చ మొదలైంది. తీర్మానంపై 20 మందికి పైగా సభ్యులు మాట్లాడనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ చర్చలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఈ శాసనసభ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు.
రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించే యజ్ఞం ఈ సమావేశంతో మొదలవుతోందని స్పీకర్ అన్నారు. 2014లో నడిసంద్రంలో చుక్కాని లేని నావలా ఆంధ్రప్రదేశ్ ఉందని.. అలాంటి సమయంలో దార్శనికుడు చంద్రబాబుకు రాష్ట్రాన్ని ప్రజలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించాలని ప్రణాళికలు రూపొందించారన్నారు. అందరి సంప్రదింపులతో అమరావతిని రాజధానిగా ఖరారు చేశారని అన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు తమ ప్రాణప్రదమైన భూములను రాజధాని కోసం విరాళంగా ఇచ్చారని తెలిపారు. అన్నదాతల అండతోనే రాజధానికి భూమి లభించిందని... అమరావతి రాజధాని పనులు వేగంగా ముందుకు సాగాయని స్పీకర్ తెలిపారు.
2019లో అమరావతికి అడ్డంకులు ఎదురయ్యాయన్నారు స్పీకర్. మూడు రాజధానుల పేరిట తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు మారినప్పుడు పాత నిర్ణయాలు కొనసాగించాలనే సూత్రానికి విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. చేతికి కొబ్బరికాయ చిక్కినట్లు ప్రవర్తించి, అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కు వెళ్లిందని వ్యాఖ్యానించారు. పాలకులు కూడా విధ్వంసానికి పాల్పడవచ్చని ఈ సంఘటనలు నిరూపించాయని స్పీకర్ వెల్లడించారు.
అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తున్నారని స్పీకర్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ధృడ సంకల్పం ఫలితంగా దీనికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందన్నారు. ఈ మేరకు అమరావతి రాజధానిగా తీర్మానం చేసేందుకు అవకాశం వచ్చిందని తెలిపారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ రోజు ఇది అని చెప్పుకొచ్చారు. ఈ చరిత్రాత్మక సమావేశానికి 11 మంది వస్తారని అనుకున్నామని... చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం వారికి లేదని తెలిసిపోయిందన్నారు. అమరావతి తీర్మానంపై జరిగే చర్చ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ‘ఇలాంటి చరిత్రాత్మక సందర్భంలో మాట్లాడే అవకాశం మీ అదృష్టం. అందరూ అర్థవంతంగా చర్చలో పాల్గొని మాట్లాడాలి’ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు నయా రూల్స్.. తప్పక పాటించాల్సిందే
రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ దిమ్మెల ధ్వంసం
Read Latest AP News And Telugu News