ఇకపై రాజధాని అమరావతికి ఇబ్బందులు ఉండవు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:27 PM
రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగువారిని గతంలో ‘మదరాసీలు’ అని పిలిచేవారని.. టీడీపీ ఆవిర్భావం తర్వాత మదరాసీ అనే ముద్ర పోయిందని తెలిపారు.
అమరావతి, మార్చి 28: ప్రజా రాజధాని అమరావతి అని.. తీర్మానం ఆమోదం తర్వాత కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలిపారు. ఏపీ అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇకపై రాజధాని అమరావతికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. శాతవాహనులు అమరావతి నుంచే పాలన సాగించారని గుర్తుచేశారు. ఆ కాలం నాటి అమరావతి విశేషాలను బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారని ముఖ్యమంత్రి తెలిపారు.
సమన్యాయం కోరాం...
తెలుగువారిని గతంలో ‘మదరాసీలు’ అని పిలిచేవారని.. టీడీపీ ఆవిర్భావం తర్వాత మదరాసీ అనే ముద్ర పోయిందని చంద్రబాబు గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. విభజన సమయంలో సమన్యాయం కోసం తాము కోరినట్లు చంద్రబాబు చెప్పారు. ఆనాడు పార్లమెంట్‌లో జగన్ కనిపించకుండా దాక్కున్నారని విమర్శించారు. విభజన తర్వాత ఏపీలో కార్యాలయాలు లేవని, బస్సులో ఉండి పరిపాలన చేశామని ఆయన వెల్లడించారు. అమరావతిలో అసెంబ్లీ, సచివాలయ భవనాలను కేవలం 9 నెలల్లోనే పూర్తి చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అదే నా సంకల్పం...
సింగపూర్ సహకారంతో ఆ స్థాయిలో రాజధాని నిర్మాణం కోసం ప్రణాళికలు ఇవ్వాలని కోరామని సీఎం తెలిపారు. ‘ముందు దేశం బాగుండాలి.. అలా ఉండాలంటే మన జాతి బాగుండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి’ అని అన్నారు. తెలుగు వాళ్లకు చెందిన హైదరాబాద్, అమరావతి తొలి రెండు స్థానాల్లో ఉండాలన్నదే తన సంకల్పమని స్పష్టం చేశారు. విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని పెట్టాలని 46 శాతం మంది కోరుకున్నట్టు శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ వివిధ జాతీయ స్థాయి సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.
ఆ రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం..
ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి రాజధాని అమరావతికి బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పారని.. కానీ రోజుకో మాట మార్చేసి ఊసరవెల్లి రాజకీయాలు చేశారని సీఎం విమర్శించారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లోనూ రాజకీయ విన్యాసాలు చేశారన్నారు. వంద ఎకరాలు తీసుకుని భవనాలు కట్టేసి రాజధాని అని చెప్పేయవచ్చని.. కానీ రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూరేలా ఓ ప్రాంతం ఉండాలని ఆలోచించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని రైతులను సంప్రదించగా 58 రోజుల్లో 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చేశారన్నారు. రాజధానికి, రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని సీఎం తెలిపారు. రాజధాని పట్ల కుట్రలు చేసిన కొందరు వక్తులు తోటలకు నిప్పు పెట్టారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకుకు ఈమెయిళ్లు పెట్టారని ఫైర్ అయ్యారు. కానీ పవిత్రమైన మట్టి, నీరుతో ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని... అందుకే ఇది శాశ్వతంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు
అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు
Read Latest AP News And Telugu News