అమరాతి రాజధాని బిల్లుపై ఢిల్లీకి అడుగులు: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:39 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఐదేళ్లుగా అనిశ్చితిగా ఉన్న రాజధాని అంశం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. అమరావతిని ఏకైక రాజధానిగా సుస్థిరపరిచే దిశలో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది
అమరావతి, మార్చి 28: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఐదేళ్లుగా అనిశ్చితిగా ఉన్న రాజధాని అంశం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. అమరావతిని ఏకైక రాజధానిగా సుస్థిరపరిచే దిశలో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించడమే లక్ష్యంగా ఢిల్లీ వేదికగా రాజకీయ వ్యూహం సిద్ధమైంది. ఈ క్రమంలోనే రాజధాని అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక బిల్లును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ‘అమరావతి రాజధాని బిల్లు నేడు ఢిల్లీకి చేరుకుంటుంది. ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుపై చర్చించి, ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 2వ తేదీన ఈ కీలక బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారు ప్రజల గొంతుకను వినిపించడంలో విఫలమవుతున్నారు. అసెంబ్లీలోనే బిల్లును ఎదుర్కోవాల్సిన బాధ్యత వైపీసీపై ఉంది. కానీ వారు సభకు రాకపోవడం చూస్తుంటే అమరావతిపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఎంపీలు ఏం చేస్తారో చూడాలి. ‘బ్లూ బుక్’ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికీ ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వంలో చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు మర్చిపోలేదు. సినిమా చూపిస్తా.. అన్న జగన్ సినిమా ఎలా ఆడిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. వైసీపీకి ఉన్న 11 సంఖ్యను దృష్టిలో ఉంచుకొని సరిగ్గా ఉదయం 11 గంటలకు ముహూర్తం చూసి మరీ అసెంబ్లీలో రాజధానిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టాం’ అని లోకేశ్ అన్నారు.
ఇది చారిత్రక తీర్మాణం.. మంత్రి నారాయణ భావోద్వేగం..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రానికి ఎదురైన అతిపెద్ద సవాలు రాజధాని నిర్మాణం. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి పాలకులు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారంటూ మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. విభజన నాటి ఛేదు జ్ఞాపకాలను, అమరావతి ఎంపిక వెనుక ఉన్న శాస్ట్రీయ కారణాలను విశ్లేషించారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏపీకి కనీసం ఒక రాజధాని నగరం లేకుండా చేశారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కేటాయించినప్పటికీ, సొంత గడ్డపై పరిపాలన సాగించాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నాం. అప్పట్లో రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి ప్రజలు అభిప్రాయాలు సేకరించింది. కమిటీ సేకరించిన అభిప్రాయాలలో మెజారిటీ ప్రజలు విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రానికి మధ్యలో ఉండటం, పోర్టులకు, జాతీయ రహదారికి దగ్గరగా ఉండేలా చూశాం. రాజధానికి సరిపడా భూమి లేకపోవటంతో భూ సమీకరణకు వెళ్లాం. కానీ, ప్రతిపక్ష నేతలు ఇక్కడ రాజధాని వద్దని ప్రజల్ని రెచ్చగొట్టారు. భూకంపాలు, ముంపు, భూమి పనికిరాని తప్పుడు ప్రచారాలు చేశారు. కొంతమంది రైతుల పొలాలు తగులబెట్టి భయపెట్టారు. అన్ని వర్గాల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ ప్రాంతాన్ని ఖరారు చేశాం’ అని అన్నారు.
అమరావతిని మూడుముక్కలాట చేసిన జగన్..
అమరావతి రాజధాని తీర్మానంపై మంత్రి సవిత మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక ముఖ్యమైన అడుగు పడింది. విభజన జరిగిన తర్వాత మనకు కూర్చోడానికి కుర్చీ కూడా లేకపోయింది. అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా నిర్ధారిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో మార్పులు చేయాలని కోరుతూ ప్రభుత్వం తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడం సాధ్యం కాదు. సీఎం చంద్రబాబు కోరిన వెంటనే ఈ ప్రాంత రైతులు 34 వేల ఎకరాలు రాష్ట్రం కోసం, రాజధాని కోసం త్యాగం చేశారు. గత పాలకులు మూడు ముక్కలాటతో రాజధానిని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అందరి కలలు నెరవేరబోతున్నాయి.. ఇదొక చారిత్రక నిర్ణయం’ అని అన్నారు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు దోచాడు..
అమరావతి రాజధాని తీర్మానంపై మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడుతూ..‘కోడి పిల్లల్ని మార్చినట్లు ఏపీకి రాజధానులు మారుతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది.తెలుగుజాతి గౌరవంగా తలెత్తుకోవాలంటే చంద్రబాబు రావాలని ప్రజలు భావించారు. 2019లో ప్రజలు తప్పు చేశారని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నారు. 2014-19 ఏపీకి స్వర్ణయుగం లాంటిది. అయినా ఓడించారు. అసెంబ్లీలో చర్చ పెట్టి అమరావతిలో అవినీతి గురించి మాట్లాడారు. తెలుగు జాతికి అన్యాయం చేయొద్దని మేం నెత్తి నోరు కొట్టుకున్నాం. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయని ఏపికి 3రాజధానులు చేశారు.
అసెంబ్లీలో సంఖ్యా బలం తక్కువగా ఉన్న 3రాజధానులకు వ్యతిరేకంగా పోరాడాం, మమ్నల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలి.. అప్పుడు అభివృద్ది మరింత వేగవంతం అవుతుందని సీఎం చంద్రబాబు భావించారు. ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న చంద్రబాబు, పవన్ కు మద్దతివ్వాలి, అమరావతి తీర్మానికి తెలుగు ప్రజలందరి తరపున స్వాగతిస్తున్నా’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ దిమ్మెల ధ్వంసం
సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు
Read Latest AP News And Telugu News