Share News

అయేషా మీరా కేసులో కీలక మలుపు: అవశేషాల అప్పగింతకు సీబీఐ కోర్టు ఆదేశం

ABN , Publish Date - Feb 20 , 2026 | 08:46 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..

అయేషా మీరా కేసులో కీలక మలుపు: అవశేషాల అప్పగింతకు సీబీఐ కోర్టు ఆదేశం
Ayesha Meera case

విజయవాడ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయేషా మీరా హత్య కేసులో శాస్త్రీయ పరీక్షల నిమిత్తం గతంలో సేకరించిన ఆమె శరీర అవశేషాలను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంతో దాదాపు దశాబ్దంన్నర కాలంగా న్యాయం కోసం పోరాడుతున్న ఆ తల్లిదండ్రులకు.. తమ కుమార్తెకు అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం లభించింది.


కోర్టు ఆదేశాల్లోని ప్రధానాంశాలు..

వైద్య బృందం భద్రపరిచిన అయేషా మీరా శరీర అవశేషాలను వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని అధికారులను సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నెల ఫిబ్రవరి 27వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో ముస్లిం మతపరమైన ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ అంత్యక్రియల ప్రక్రియ సజావుగా సాగేలా అవసరమైన భద్రతను, వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. పారదర్శకత కోసం ఈ మొత్తం ప్రక్రియను ప్రభుత్వ అధికారుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.


కేసు నేపథ్యమిదే..

2007లో విజయవాడ శివార్లలోని ఒక హాస్టల్‌లో బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. మొదట స్థానిక పోలీసులు విచారణ జరిపారు. అనంతరం బాధితురాలి తల్లిదండ్రుల పోరాటంతో కేసు సీబీఐ (CBI) కి బదిలీ అయ్యింది. ఈ విచారణలో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం ఆమె మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించి, కీలక ఆధారాల కోసం అవశేషాలను సేకరించారు.


కుటుంబ సభ్యుల స్పందన..

తమ కుమార్తె శరీర అవశేషాల కోసం గత కొంతకాలంగా అయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా.. న్యాయపోరాటం చేస్తున్నారు. కోర్టు తాజా ఆదేశాలపై ఆమె స్పందిస్తూ, కనీసం ఇన్నేళ్లకైనా తన కుమార్తెకు సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికే అవకాశం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 09:06 PM