వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది గత ప్రభుత్వమే: అశోక్ బాబు
ABN , Publish Date - Apr 22 , 2026 | 02:42 PM
2024 ఎన్నికల సమయంలో కాకర్ల వెంకట్రామిరెడ్డి వైసీపీ జెండాలు పట్టుకుని ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని అశోక్ బాబు తెలిపారు. బద్వేల్ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పట్లో వెంకట్రామిరెడ్డిపై నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు.
అమరావతి, ఏప్రిల్ 22: గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిపై చర్యలు ప్రారంభమయ్యాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు తెలిపారు. ‘2024లో ఆయనను సస్పెండ్ చేసింది మీ ప్రభుత్వమే’ అని గుర్తుచేశారు. 2024 ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి వైసీపీ జెండాలు పట్టుకుని ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బద్వేల్ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పట్లో వెంకట్రామిరెడ్డిపై నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రాజకీయ ప్రచారంలో పాల్గొనడం 'కండక్ట్ రూల్స్'కు విరుద్ధమని.. అందుకే డిస్మిస్ చేశారని అశోక్ బాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగష్టులో జరిగిన విచారణలో వెంకట్రామిరెడ్డి నేరం చేసినట్లు రుజువైందన్నారు. వెంకట్రామిరెడ్డి అరాచకాలు, నిబంధనల ఉల్లంఘనలన్నీ జీఓ 464లో స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు తప్పు చేస్తున్నారంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు బాకీ పెట్టి, జీతాలు సకాలంలో ఇవ్వని వ్యక్తి జగన్ అంటూ విమర్శించారు.
ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత, హక్కు జగన్‌కు లేదని అశోక్ బాబు వ్యాఖ్యానించారు. ఏబీ వెంకటేశ్వరరావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి అధికారులను వేధించింది మరిచిపోయారా అని నిలదీశారు. ఉద్యోగులను బెదిరించి దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఘనత జగన్‌దే అంటూ దుయ్యబట్టారు. కూటమి పాలనలో ఇప్పటికే ఉద్యోగులకు రూ.22,000 కోట్ల మేర బకాయిలు చెల్లించామని చెప్పారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో అక్రమాలకు పాల్పడి పబ్లిక్ స్థలాలను కూడా అమ్మేసుకున్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని ఆరోపించారు.
వెంకట్రామిరెడ్డి కుటుంబం మొత్తం వైసీపీ కార్యకర్తలే అని.. ఆయన భార్య ముషీరాబాద్ టికెట్ అడిగిన విషయం నిజం కాదా అని అశోక్ బాబు ప్రశ్నించారు. కరోనా సమయంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు చనిపోతే పట్టించుకోని జగన్.. ఉద్యోగుల పాలిట 'నరకాసురుడు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిబంధనల ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే అని అశోక్ బాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ధనుంజయ్, వాసుదేవ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వండి.. సిట్ లేఖలు
డ్రైవర్ హత్య కేసులో సాక్షులకు బెదిరింపులు.. అనంత బాబు కోసం పోలీసుల గాలింపు
Read Latest AP News And Telugu News