Share News

ఆర్టీసీ కార్మికుల సమ్మె.. హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:50 PM

టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచాలని నిర్ణయించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె.. హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..
Hyderabad Metro Rail

హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచాలని నిర్ణయించారు. ఆర్టీసీ సమ్మె ముగిసేవరకూ 56 మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. మియాపూర్- ఎల్.బి.నగర్ కారిడార్‌లో 4 నిమిషాల 20 సెకన్ల విరామంతో, అలాగే నాగోల్- రాయదుర్గం కారిడార్‌లో 3 నిమిషాల 40 సెకన్ల విరామంతో రోజంతా గరిష్ఠంగా 56 రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. చివరి మెట్రో రైలు సర్వీస్ రాత్రి 11 గంటల తర్వాత కూడా పొడిగించేలా చర్యలు చేపట్టినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు.


కాగా, ఇవాళ్టి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అన్ని జిల్లాల వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే బస్సులను డిపోలకు పరిమితం చేశారు. రహదారులపై బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి బస్సులన్నీ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో దాదాపు రోజుకు 25 లక్షల మంది ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు. అయితే, కార్మికుల సమ్మెతో నగరవాసులు మెట్రో రైళ్లపై ఆధారపడాల్సి వచ్చింది. ఉదయం నుంచి రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు తండోపతండాలుగా మెట్రోస్టేషన్లకు తరలివస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 56 మెట్రో రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గామ్ ఉగ్రదాడి అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్..

ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం: హరీశ్ రావు

Updated Date - Apr 22 , 2026 | 01:23 PM