అర్నబ్ తుఫాన్ ముప్పు.. అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 04:55 PM
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో వర్షపాతం, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని నిర్దేశించారు.
ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. వర్షాల కారణంగా సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సత్వర స్పందన బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.
ఇవీ చదవండి
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖను అప్రమత్తం చేసిన మంత్రులు అనిత, గొట్టిపాటి
ఏపీకి తుపాను ముప్పు.. హోంమంత్రి కీలక ఆదేశాలు