ఏపీ పంచాయతీ ఎన్నికల ఫేజ్-3.. రెండు రోజుల్లో 16,505 సర్పంచ్ నామినేషన్లు
ABN , Publish Date - Nov 23 , 2026 | 10:54 AM
ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,244 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
అమరావతి, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,244 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఫేజ్-3 ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 46 రెవెన్యూ డివిజన్లు, 214 మండలాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ పదవులకు రెండు రోజుల్లో మొత్తం 16,505 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు (నవంబర్ 21) 4,929 నామినేషన్లు రాగా.. రెండో రోజు(నవంబర్ 22) 11,576 నామినేషన్లు నమోదయ్యాయి. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు నామినేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
అటు వార్డు సభ్యుల పదవులకు కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో మొత్తం 60,420 నామినేషన్లు నమోదయ్యాయి. మొదటి రోజు 13,611 నామినేషన్లు దాఖలవగా.. రెండో రోజు 46,809 నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్ నామినేషన్లలో శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో అత్యధికంగా 1,336 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 1,092, విజయనగరంలో 930, మార్కాపురంలో 908, వైఎస్ఆర్ కడప జిల్లాలో 905 నామినేషన్లు నమోదయ్యాయి. వార్డు సభ్యుల నామినేషన్లలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 4,892 నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీకాకుళంలో 4,661, విజయనగరంలో 4,429, అనకాపల్లిలో 3,748, కాకినాడలో 3,559 నామినేషన్లు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
మార్కెట్ల పతనం, ఇరాన్ దాడులకు డెమోక్రాట్ల విజయమే కారణం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
సత్యసాయి బాబా సేవలు చిరస్మరణీయం.. సీఎం చంద్రబాబు నివాళి
Read Latest AP News And Telugu News