కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలక్షేత్రం
ABN , Publish Date - Nov 23 , 2026 | 07:45 AM
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలు వెలిగించి గంగమ్మకు భక్తిశ్రద్ధలతో మొక్కులు సమర్పిస్తున్నారు.
నంద్యాల, నవంబరు 23: కార్తీక రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలు వెలిగించి గంగమ్మకు భక్తిశ్రద్ధలతో మొక్కులు సమర్పిస్తున్నారు. కాగా.. పవిత్ర కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు సాయంత్రం ఆలయంలో ‘లక్ష దీపోత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
కార్తీక రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేకుమజాము నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పాతాళ గంగలో స్నానాలు ఆచరించి.. భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలు వెలిగిస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది.
అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడం వల్ల స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. నిన్న (ఆదివారం) శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామిని 43,247 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
హర హర మహాదేవ అంటూ..
పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం పంచారామంలో కార్తీక సోమవారం సందర్భంగా రామలింగేశ్వర స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. పవిత్ర సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా స్వామి వారి నామస్మరణలతో మార్మోగుతోంది. శిరోభాగ నిలయంలో భక్తులు ఘనంగా దీపోత్సవాలను నిర్వహిస్తున్నారు.