Share News

ఐటీఐ విద్యార్థులు తక్కువేం కాదు!

ABN , Publish Date - Nov 23 , 2026 | 06:54 AM

ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు కూడా సమాజంలో గౌరవం, గుర్తింపు దక్కాలని మంత్రి లోకేశ్‌ అన్నారు.

ఐటీఐ విద్యార్థులు తక్కువేం కాదు!
lokesh

  • వారికి ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా గౌరవం దక్కాలి: మంత్రి లోకేశ్‌

  • ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మద్దతు

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు కూడా సమాజంలో గౌరవం, గుర్తింపు దక్కాలని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఐటీఐ కోర్సుల పట్ల ఉన్న చిన్నచూపును తొలగించి, నైపుణ్యం కలిగిన కార్మికులకు సముచిత గౌరవం కల్పించాలన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా మద్దతు తెలిపారు. ‘చాలా ముఖ్యమైన అంశం ప్రస్తావించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులు కూడా గౌరవానికి అర్హులు. ఏఐ యుగంలో నైపుణ్యం కలిగిన కార్మిక శక్తికి ఎంతో విలువ, ఉపాధి అవకాశాలు ఉంటాయి. నేను జర్మనీలోని ఆటోమొబైల్‌ ఫ్యాక్టరీలలో ఇంటర్న్‌షిప్‌ చేసినప్పుడు, అక్కడ నైపుణ్యం కలిగిన కార్మికులను ఎంతగా గౌరవిస్తారో స్వయంగా చూశాను. ఆ గౌరవమే జర్మనీని అత్యుత్తమ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ఐటీఐల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, నైపుణ్యంతో కూడిన వృత్తుల పట్ల గర్వపడే వాతావరణాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు యూపీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పిల్లలు ఐటీఐ కోర్సులు చేయడానికి తల్లిదండ్రులు సిగ్గుపడే మనస్తత్వాన్ని మార్చాలని, పరిశ్రమలు వారి నైపుణ్యం, కష్టంపైనే ఆధారపడి నడుస్తాయని పేర్కొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 06:54 AM