ప్రతిపక్షం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది: మంత్రి పయ్యావుల కేశవ్
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:21 PM
ఏపీ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగించారు. సభలో ప్రతిపక్షం లేకపోవడం బాధగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ.. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించిందని మంత్రి విమర్శించారు.
అమరావతి, మార్చి 6: ఏపీ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) ప్రసంగించారు. సభ్యులంతా బడ్జెట్ డిమాండ్లపై ఉత్సాహంగా చర్చలో పాల్గొన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కూడా వివిధ శాఖల డిమాండ్లపై మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చర్చలో మాట్లాడినట్లు రికార్డుల్లో లేదని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబును చూసి నేర్చుకోవచ్చని మంత్రి అన్నారు.
సభలో ప్రతిపక్షం లేకపోవడం బాధాకరంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ఎవరైనా ద్రవ్య వినిమయ బిల్లు చర్చలో పాల్గొనడానికి ఎదురుచూసేవారని చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం కోసం గట్టిగా ప్రయత్నించేవాళ్లమని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందని మంత్రి విమర్శించారు. బడ్జెట్ భాషను సరళీకృతం చేశామని, ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి సభ అనుమతి తీసుకుంటున్నట్లు తెలిపారు. 2023-24లో మూలధన వ్యయం రూ.24 వేల కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.53,915 కోట్లకు పెంచామని వివరించారు. మూలధన వ్యయం పెరగడం వల్ల మౌలిక వసతులు మెరుగుపడి వేగంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చెప్పే సంపద సృష్టి జరగాలంటే మూలధన వ్యయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి. సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, రోడ్ల నిర్మాణం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు జరిగి సంపద వృద్ధి చెందుతుందని వివరించారు.
పాలన అంటే బటన్లు నొక్కడం కాదని.. ప్రజలకు తమ కాళ్ల మీద నిలబడే శక్తిని అందించడమని మంత్రి చెప్పారు. చేపలు పెట్టడం కాదు.. పట్టాలన్న కార్ల్ మార్క్స్ చెప్పిన మాటల్ని చంద్రబాబు పదేపదే చెబుతారని.. ఈ ప్రభుత్వం అదే విధంగా పనిచేస్తోందని తెలిపారు. సంక్షేమాన్ని విస్మరించలేదని.. సంక్షేమాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు బాగా ఉపయోగించుకుంటున్నారని.. పథకాల ద్వారా మహిళల సంతోష స్థాయిని పెంచామని తెలిపారు. తాము ఇచ్చిన పథకాలన్నీ కుటుంబ బడ్జెట్‌కు చేదోడుగా నిలుస్తున్నాయని మంత్రి వివరించారు.
ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా బడ్జెట్ రూపొందించామని మంత్రి పయ్యావుల వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టులు ఆపామని వైసీపీ చెప్పడం అబద్ధమని మంత్రి ఖండించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్జీటీ ఆదేశాలతో రాయలసీమ ఎత్తిపోతలు ఆపేశారని, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే కనీసం దానివైపు చూడని వ్యక్తి జగన్ అని విమర్శించారు. అధికారం కోసం ప్రతిసారీ పెత్తందార్లు రాయలసీమ పేరుతో మాట్లాడతారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మాత్రమే రాయలసీమ గురించి చిత్తశుద్ధితో పనిచేస్తే.. చంద్రబాబు దాన్ని కొనసాగించారని తెలిపారు. మంచి చేసినప్పుడు చెప్పడంతో పాటు.. అవతలి వారి తప్పులు కూడా చెప్పాలన్నారు. రాజకీయ నిరుద్యోగులంతా ఒక చోట చేరి.. రాయలసీమ గురించి ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
‘గణపతి జనజీవన స్రవంతిలోకి రండి.. నేనూ మీతో పనిచేస్తా’: గోనె ప్రకాశ్ రావు
హృదయపూర్వక అభినందనలు చిట్టితల్లులు: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News