స్థానిక ఎన్నికల్లో కూటమికి 95 శాతం స్ట్రైక్ రేట్: అశోక్ బాబు
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:58 PM
స్థానిక సంస్థల ఎన్నికలు 100 శాతం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తెలిపారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో 95 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి ఘనవిజయం సాధించిందన్నారు.
అమరావతి, నవంబర్ 20: స్థానిక సంస్థల ఎన్నికలు 100 శాతం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తెలిపారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో 95 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి ఘనవిజయం సాధించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 35 శాతం సీట్లు కేటాయించి సామాజిక న్యాయం చేశామని చెప్పారు. చట్టపరంగా లేకపోయినా జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు, ఎస్టీలకు అవకాశం కల్పించామని అన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 కార్పొరేషన్లలో 10(59%), 106 మున్సిపాలిటీలలో 58 మహిళలకు కేటాయించామని అశోక్ బాబు అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో 56 శాతం మహిళలకు, 28 జిల్లాల్లో 8 స్థానాలు బీసీలకు ఇచ్చామని చెప్పారు. రాజకీయ అనుభవం లేని సామాన్యులకు, యువతకు స్థానిక సంస్థల్లో పెద్దపీట వేశామని.. వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉన్నామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని జనరల్ స్థానంలో ఎస్టీ మహిళకు, మంగళగిరి కార్పొరేషన్‌ను ఎస్టీలకు కేటాయించామన్నారు.
కూటమి ధర్మాన్ని పాటిస్తూ బీజేపీకి తగిన ప్రాధాన్యం ఇచ్చి ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ పదవులు కేటాయించామని మాజీ ఎమ్మెల్సీ తెలిపారు. గతంలో 2020-21 ఎన్నికల్లో వైసీపీ చేసిన అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ భూతద్దం పెట్టి వెతుక్కునే పరిస్థితికి దిగజారిందని విమర్శించారు. పులివెందుల, పుంగనూరులలోనూ స్వేచ్ఛగా ఎన్నికలు జరగడంతో ప్రజలు వైసీపీని తిరస్కరించారన్నారు. పార్టీ ఆదేశాలను కాదని రెబల్స్‌గా పోటీ చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేశామని చెప్పారు. జంతుబలులు, రక్తపాతం సృష్టించే ‘రప్పా రప్పా’ బ్యాచ్ సంస్కృతిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అశోక్ బాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా.. కోరం లేక నిలిచిన ప్రక్రియ
పీఎం స్వనిధి అమలులో ఏపీ మెప్మాకు జాతీయ అవార్డులు.. మంత్రి నారాయణ హర్షం
Read Latest AP News And Telugu News