ఏపీలో కిలో ఉల్లిపాయ రూ.32కే.. వచ్చే వారం నుంచే విక్రయాలు: నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - Sep 08 , 2026 | 04:09 PM
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీలో కిలో ఉల్లిపాయ రూ.32కే సర్కార్ అందించనున్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీలో కిలో ఉల్లిపాయ రూ.32కే సర్కార్ అందించనున్నట్లు తెలిపారు. వచ్చే వారం నుంచి 115 రైతు బజార్లలో ఉల్లిపాయ విక్రయించనున్నట్లు చెప్పారు. మొబైల్ కౌంటర్ల ద్వారా కూడా ఉల్లిపాయ సరఫరా చేస్తామన్నారు. రేషన్‌తో కిలో కందిపప్పును సబ్సిడీపై ప్రభుత్వం అందించనుందని తెలిపారు. మార్కెట్ ధర కంటే 25-30శాతం తక్కువకు కందిపప్పు విక్రయిస్తామన్నారు. 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కంది సేకరణకు కేంద్రం సహకారం అందించనున్నట్లు వెల్లడించారు.
నాలుగు నుంచి ఐదు నెలల పాటు కందిపప్పును పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పామాయిల్ ధరల నియంత్రణకూ కేంద్రంతో చర్చలు జరుపుతామని చెప్పారు. పీడీఎస్ బియ్యంలో 25శాతం నూకల స్థానంలో 10శాతం నూకలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఏపీ పైలట్‌ను కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయనుందన్నారు. అక్టోబర్ 1 నాటికి వెయ్యి ‘మీ మార్ట్’ దుకాణాలు ప్రారంభిస్తామని.. ఇప్పటికే 870 ‘మీ మార్ట్’ దుకాణాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 64 రకాల నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు మీ మార్ట్ దుకాణాల ద్వారా అమ్మకాలు చేయనున్నట్లు తెలిపారు. 100, 250, 500 గ్రాముల చిన్న ప్యాకెట్లలో సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు.
రైతులకు 24 గంటల్లోనే ధాన్యం చెల్లింపులు కొనసాగుతాయని నాదెండ్ల వెల్లడించారు. 37-38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉందన్నారు. పీడీఎస్‌లో పంచదార, పచ్చిశనగల పంపిణీ యథావిధి కొనసాగుతుందన్నారు. త్వరలో రేషన్‌తో పామాయిల్ సరఫరా చేయడమే లక్ష్యమని తెలిపారు. ఎల్‌పీజీ రీబుకింగ్‌కు 25 రోజుల గ్యాప్ అమల్లోకి రానుందన్నారు. విజయసాయి రాజకీయ పార్టీని మంత్రి స్వాగతించారు. ఎవరైనా పార్టీ పెట్టొచ్చన్నారు. విజయసాయిరెడ్డి రాజకీయ ప్రవేశానికి స్వాగతం పలికారు. కాగా.. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు.
ఇవి కూడా చదవండి...
వీసా స్కాం కేసులో పోలీసు విచారణకు రమానందన
జగన్ నాతో నీతులు చెప్పించుకునే స్థాయికి దిగజారారు: దస్తగిరి
Read Latest AP News And Telugu News