టీచర్లపై వైసీపీ దాడి.. వదిలే ప్రసక్తే లేదంటూ మంత్రి లోకేశ్ వార్నింగ్
ABN , Publish Date - Sep 21 , 2026 | 03:20 PM
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ నేతలు దాడి చేయడంపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువులపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.
అమరావతి, సెప్టెంబర్ 21: విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ నేతలు దాడి చేయడంపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గురువులపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. గురువులపై దాడి చేసిన క్రిమినల్ గ్యాంగ్‌లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వాళ్ల భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. అందరూ దైవంలా భావించే గురువులను వైన్ షాపులకు కాపలా పెట్టిన జగన్.. ఉపాధ్యాయులను గౌరవిస్తారని అనుకోవడం భ్రమ అని అన్నారు. అత్యుత్తమ ఆటతీరుతో రాష్ట్రం, దేశ సత్తాను ప్రపంచానికి చాటిన క్రీడాకారులను స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు అంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ దుర్బుద్ధి బయటపడిందని వ్యాఖ్యానించారు.
జగన్ ఫేక్ ముఠా తప్పుడు నిందలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్ కోటా డీఎస్సీ 2025 టీచర్లు తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారని మంత్రి తెలిపారు. క్రీడలతో దేశ పతాకాన్ని రెపరెపలాడించి, ప్రతిభతో టీచర్ ఉద్యోగం సాధించిన స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ ఫ్యాక్షన్ ముఠా శాప్ కార్యాలయం వద్ద దాడికి దిగిందని మండిపడ్డారు. రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచులను టీచర్లపైకి ఉసిగొల్పడం జగన్ నేర మనస్తత్వాన్ని బయటపెట్టిందని విమర్శించారు. పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన జగన్ క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తి లేదన్నారు. టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలన్నారు. వైసీపీ ప్రేరేపిత రౌడీ షీటర్లు, గంజాయి-బ్లేడ్ బ్యాచుల పనిపడతామంటూ ఎక్స్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే నాంది: సీఎం చంద్రబాబు
నా పాలనలో ఏ డీఎస్సీలోనూ అవకతవకలు జరగలేదు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News