Share News

నా పాలనలో ఏ డీఎస్సీలోనూ అవకతవకలు జరగలేదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 21 , 2026 | 02:36 PM

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ దాడులపై కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. టీచర్లపై వైసీపీ నేతల దాడిని తప్పుపట్టారు.

నా పాలనలో ఏ డీఎస్సీలోనూ అవకతవకలు జరగలేదు: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

చిత్తూరు, సెప్టెంబర్ 21: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ దాడులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కుప్పం బహిరంగ సభలో స్పందిస్తూ.. టీచర్లపై వైసీపీ నేతల దాడిని తప్పుపట్టారు. డీఎస్సీ ఉద్యోగాలు తమ కష్టార్జితమని టీచర్లంతా నినదిస్తున్నారని.. ఫేక్ పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదని విజయవాడలో స్పోర్ట్స్ టీచర్లు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఇవాళ విజయవాడలో గురువులపై రౌడీలు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని... చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘సీబీఎన్ జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లలో అవినీతే జరగలేదు.. నా హయాంలో ఎప్పుడూ పేపర్ లీక్ కాలేదు. సీబీఎన్ పాలనలో టీచర్ల రిక్రూట్మెంట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం... ఇదీ మన ట్రాక్ రికార్డ్’ అని వెల్లడించారు.


నియామకాలు జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ బురద జల్లుతున్నారని సీఎం మండిపడ్డారు. కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, విశాఖలో సముద్రం ఒడ్డున దుష్ప్రచారాన్ని తిప్పడికొడుతూ టీచర్లు గర్జించారన్నారు. ఫేక్ పేపర్‌కు చెందిన రిపోర్టర్ ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేశారంటే... వైసీపీ మూకలు ఎంతకు బరితెగించాయో అర్థం చేసుకోవాలని అన్నారు. ఇలాంటి వాళ్లను ఇంకా ఉపేక్షించాలా..? వీరిలాగే కొనసాగితే ఆస్తులకు ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో చూపించి వారి నోళ్లు మూయిస్తామని తెలిపారు. చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియపై అవసరమైతే కోర్టులకు వెళ్లొచ్చని... కానీ దాడులేంటీ...? ఉపాధ్యాయులపై రౌడీలను ఎగదొయడమేంటీ అంటూ ఫైర్ అయ్యారు.


2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని... రాష్ట్రానికి అది మామూలు నష్టం కాదని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. నాటి పాలనలో పాలకులే రౌడీయిజం చేశారని.. దారుణాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. కుప్పం వస్తే తనను కూడా ఇబ్బందులు పెట్టారని.. దౌర్జన్యాలకు దిగారని మండిపడ్డారు. ఓడిపోయిన తర్వాత కూడా చంపడానికైనా చావడానికైనా సిద్ధమంటూ రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. రౌడియిజం చేసే వారి తోక కత్తిరిస్తామని... రౌడీలను విధ్వంసకారులను తరిమి కొట్టే సత్తా కుప్పానికి ఉందని హెచ్చరించారు. ఫ్లెక్సీలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రక్తాభిషేకం చేస్తున్న వారిని సైకోలు అనాలా..? మానసిక రోగులు అనాలా..? అంటూ వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్ర లడ్డూను కూడా కల్తీ చేశారని మండిపడ్డారు. ప్రతి ఎన్నికలోనూ సైకిల్ గుర్తుకు మాత్రమే ఓటేసి మద్దతిచ్చిన నియోజకవర్గాలు ఒకటి కుప్పం, రెండోది హిందుపూర్ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు.. ఎప్పటి నుంచో తెలుసా

ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే నాంది: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 02:56 PM