Share News

ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే నాంది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 21 , 2026 | 01:34 PM

కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. గడచిన రెండేళ్లలో రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు.

ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే నాంది: సీఎం చంద్రబాబు
CM Chandrababu

కుప్పం, సెప్టెంబర్ 21: ‘నారావారి పల్లె నాకు జన్మనిస్తే కుప్పం నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే నాంది పలుకుతాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో పర్యటిస్తున్న సీఎం.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. కుప్పాన్ని ఓ మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలన్నీ చేస్తున్నామని తెలిపారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తీసుకువచ్చి 133 చెరువులను నింపగలిగామని చెప్పారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. త్వరలో యామిగాని పల్లి, మనపల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు.


కుప్పంలో 550 పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను లిఫ్ట్ ఇరిగేషన్, పైపులైన్లతో అనుసంధానం చేస్తామని సీఎం అన్నారు. పశుదాణాకు కూడా ఇబ్బంది లేకుండా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం, పీఎండీఎస్ విధానాల ద్వారా ఎల్‌నినోను రైతులంతా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఉద్యాన పంటలను కూడా సాగు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది రిజర్వాయర్లలో తక్కువ నీరు ఉందని... మిగిలిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చిరు ధాన్యాల పంటల ద్వారా తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే ఆస్కారం ఉందని చెప్పుకొచ్చారు. పశుపోషణ, పౌల్ట్రీ లాంటి అంశాలపై దృష్టి సారించటం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని రైతులు, మహిళలు సాధించే అవకాశం ఉంటుందని సూచించారు. రెండు నెలల క్రితం పర్యటనకు వచ్చినప్పుడు కుప్పంలో రూ. 7939 కోట్ల విలువైన పనులు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని అన్నారు. ఇప్పుడు మళ్లీ కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన ప్రభుత్వ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. అలాగే రూ.289 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా భూమి పూజ నిర్వహించామన్నారు.


రూ.3.30 కోట్ల సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ, మెటిరియల్ రికవరీ ప్లాంట్, వ్యవసాయ ఫీడర్ల కోసం 14-15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రూ.10 కోట్లతో 35 పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనులు, ఎన్ఎఏసీ భవనంలో మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించుకున్నామన్నారు. రూ.2 కోట్లతో స్థానిక ఉత్పత్తులను విక్రయించుకునేలా ఆధునిక రైతు బజార్ నిర్మిస్తామని చెప్పారు. రూ.13 కోట్ల వ్యయంతో కుప్పం ఆర్డీఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాలను కూడా నిర్మిస్తున్నామని.. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రూ.15 కోట్ల వ్యయంతో చేపడతామని తెలిపారు. రూ.8 కోట్ల వ్యయంతో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో హైమాస్ట్ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నామని.. రూ.184 కోట్ల వ్యయంతో మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ యుటిలిటీని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.


హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా బీరువాని పల్లె వద్ద రూ.45 కోట్లతో ఓ రిజర్వాయర్ నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. మల్లనూరు దగ్గర రూ.27 కోట్ల వ్యయంతో ఓ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 16 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మించేలా, హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్ట్రర్ ఏర్పాటు చేయబోతున్నామని, కుప్పం మార్కెట్ యార్డులో రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశామని అన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు డిజిటల్ లిటరసీతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. కుప్పంలోనూ 8500 మంది మహిళలకు శిక్షణ అందుతోందన్నారు. అలాగే, కుప్పంలో 32 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని.. రెండేళ్లలో పరిశ్రమలు, అనుబంధ కార్యక్రమాలతో యువతకు ఉద్యోగాలు ఉపాధి వచ్చిందని తెలిపారు. స్థానికంగా వచ్చిన పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఇప్పటికే నైపుణ్య శిక్షణ ఇస్తోందని, మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు.


దాదర్- పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు ఇవాళ్టి నుంచి కుప్పం రైల్వే స్టేషనులో ఆగుతుందని సీఎం తెలిపారు. కుప్పాన్ని అనుసంధానిస్తూ బెంగుళూరు, చైన్నై, కేజీఎఫ్, కృష్ణగిరి లాంటి ప్రాంతాలను అనుసంధానించేలా జాతీయ రహదారులు వస్తున్నాయన్నారు. కుప్పం- పొగురుపల్లి నుంచి బెంగుళూరుకు ఓ ప్రత్యామ్నాయ రహదారిని కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. చిత్తూరు నుంచి కుప్పానికి బ్రాడ్ గేజ్ లైన్ కనెక్ట్ చేయాలని రైల్వేశాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. కుప్పంలో ఉత్పత్తి చేసిన వస్తువులు కృష్ణపట్నం పోర్టుకు చేరేలా ఈ కనెక్టివిటీని పెంచుతున్నామన్నారు. త్వరలోనే కుప్పంలో ఎయిర్‌పోర్టును కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొత్తంగా స్వర్ణ కుప్పంగా ఈ నియోజకవర్గాన్ని మారుస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రతీ ఇంటిపైనా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


కాగా.. కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ పథకాల లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు. కుప్పం అభివృద్ధిపై స్థానికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం కొనసాగుతుండగా మసీదులో అజా ప్రార్ధన మొదలైంది. దీంతో అజా ప్రార్థన వినిపించగానే తన ప్రసంగాన్ని మధ్యలో కొద్దిసేపు నిలిపివేసిన సీఎం చంద్రబాబు.. ప్రార్థన ముగిశాక ప్రసంగాన్ని కొనసాగించారు.


ఇవి కూడా చదవండి...

తుఫాన్‌ ఎఫెక్ట్‌.. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు.. ఎప్పటి నుంచో తెలుసా

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 01:47 PM