ఏపీలో ఎల్‌నినో ప్రభావంపై సీఎస్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:17 PM
ఏపీలో ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలూ అప్రమత్తంగా పనిచేసి ప్రాణ, ఆస్తి, పంటల నష్టాన్ని పూర్తిగా నివారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, జులై 17: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈరోజు(శుక్రవారం) సచివాలయంలో జరిగిన సమీక్షలో పలు శాఖల అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలూ అప్రమత్తంగా పనిచేసి ప్రాణ, ఆస్తి, పంటల నష్టాన్ని పూర్తిగా నివారించాలన్నారు. హైరిస్క్ రైతు సేవా కేంద్రాలు, మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు. రైతులకు నిరంతర సాంకేతిక సలహాలు అందిస్తూ, ప్రత్యామ్నాయ పంటల సాగు, తక్కువ కాలపరిమితి పంటలు, డ్రై సోయింగ్‌ను విస్తృతంగా ప్రోత్సహించాలన్నారు. ప్రత్యామ్నాయ విత్తనాల నిల్వలు ముందుగానే సిద్ధం చేసి, అవసరమైన ప్రాంతాలకు వెంటనే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
తేమలేమితో ఆహారానికి పనికిరాని పంటలను పచ్చిమేతగా వినియోగించాలని... పంట అవశేషాల దహనాన్ని పూర్తిగా నిరోధించి పశుగ్రాసంగా ఉపయోగించాలని సీఎస్ సూచించారు. మేత పంటలకు రక్షిత సాగునీరు కల్పించి, పశుగ్రాస కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మిగులు జిల్లాల నుంచి కొరత జిల్లాలకు పశుగ్రాస రవాణా వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం ఒక పశు శిబిరం ఏర్పాటు చేసి.. పశువులకు తాగునీరు, పశుగ్రాసం, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పశుగ్రాస బ్యాంకులు, మొబైల్ వెటర్నరీ సేవలు, జిల్లా స్థాయి అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలిపారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో చర్యల అమలుపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ.. రైతులు, పశుపోషకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎస్ జి.సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజంపై ప్రభుత్వం ఫోకస్
Read Latest AP News And Telugu News