మోదీ ఆశీస్సులు, నిర్మల ఆలోచనలతో పరుగులు పెడుతోన్న ఏపీ: పయ్యావుల కేశవ్
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:53 PM
రాజకీయాల కోసం ఈ ప్రాంతంలో వైషమ్యాలు పెంచిన వాళ్లను గతంలో చూశామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఒకే రోజున రూ.3 వేల కోట్లను కూటమి ప్రభుత్వం అందించిందని తెలిపారు.
పల్నాడు జిల్లా, జులై 17: రాజకీయాల కోసం ఈ ప్రాంతంలో వైషమ్యాలు పెంచిన వాళ్లను గతంలో చూశామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఒకే రోజున రూ.3 వేల కోట్లను కూటమి ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఈరోజు(శుక్రవారం) నరసరావుపేటలో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను వైసీపీ అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక.. ఏ పని చేయాలన్నా ఖజానాలో డబ్బు లేని పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆలోచనలతో ఏపీ ఇప్పుడు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందన్నారు.
ఒక మహిళ ఇంటిని ఎలా తీర్చిదిద్దుతుందో అంతకంటే మెరుగ్గా నిర్మలా సీతారామన్ పని చేస్తున్నారని మంత్రి కొనియాడారు. ‘2024లో మీరు వేసిన ఒక్క ఓటు వల్లే ఏపీకి అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, తల్లికి వందనం, ఉచిత బస్సు, గూగుల్ వంటి కంపెనీల రాక సాధ్యమైంది’ అని చెప్పుకొచ్చారు. ఏపీకి ఏ కష్టం వచ్చినా నిర్మలా సీతారామన్ ఇంటి తలుపు తట్టి సాయం అడుగుతున్నామని.. రాష్ట్రం కోసం ఏం అడిగినా కాదనకుండా కేంద్ర మంత్రి పని చేస్తున్నారని తెలిపారు. విశాఖలో ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు నిర్మలమ్మ చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీయే ప్రభుత్వం.. రేయింబవళ్లూ రాష్ట్రం కోసం పని చేస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
మహిళలు, యువతకు భారీగా రుణాలు: శ్రీకృష్ణదేవరాయలు
ప్రతి గ్రామానికి కేంద్ర పథకాలు చేరాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మహిళలు, యువత, వ్యాపారాలకు భారీగా రుణాలు ఇస్తున్నామన్నారు. మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్లకు బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు. అటవీ సాగుహక్కు పట్టాలు పొందిన గిరిజనులకు కూడా రుణాలు అందిస్తున్నామని చెప్పారు. బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా సంఘాల డిపాజిట్లకు వడ్డీ చెల్లించాలని.. డ్వాక్రా సంఘాల వారితో 25 మండలాల్లో 25 మెగావాట్ల సౌరవిద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.
ఇవి కూడా చదవండి...
తక్కువ నాణ్యత పొగాకుకూ గిట్టుబాటు ధర.. టొబాకో బోర్డుకు మంత్రి అచ్చెన్న ఆదేశాలు
గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..
Read Latest AP News And Telugu News