వరంగల్‌లో శివాజీ విగ్రహ వివాదం.. బొల్లికుంటలో హైటెన్షన్
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:06 AM
వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. బొల్లికుంట చౌరస్తాలో అర్ధరాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారి తీసింది.
వరంగల్, జులై 17: ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. బొల్లికుంట చౌరస్తాలో అర్ధరాత్రి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఈ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు. అదే స్థలంలో మరోసారి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళితులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా బొల్లికుంట జంక్షన్‌లో అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ అనుబంధ సంఘాలు రాత్రికి రాత్రే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. విషయం తెలిసిన వెంటనే బొల్లికుంటలో పోలీసులు భారీగా మోహరించారు.
శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారడంతో అధికారులు స్పందించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని తొలగించి గుంటూరుపల్లి మీదుగా తరలించారు. దీనిపై బీజేపీ అనుబంధ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శివాజీ విగ్రహం తొలగించడాన్ని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రంగా ఖండించారు. వెంటనే విగ్రహం వద్దకు వచ్చిన రవిని పోలీసులు అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి తీసుకెళ్లారు. శివాజీ విగ్రహం ఏర్పాటు, ఆపై తొలగింపు నేపథ్యంలో బొల్లికుంటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి...
దారుణం: కన్నకొడుకుని కర్రతో కొట్టి చంపిన తండ్రి
ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్య.. ప్రాణాలతో బయటపడ్డ కుమారుడు
Read Latest Telangana News And Telugu News