ఏపీకి రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులు.. 24 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: ఎంపీ విజయ్
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:08 PM
విశాఖపట్నంలో రేపటి నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సీఐఐ సమ్మిట్ ప్రారంభంకానుందని ఎంపీ చింతకాయల విజయ్ తెలిపారు. వైజాగ్ సీఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామన్నారు.
అమరావతి, నవంబర్ 11: విశాఖపట్నంలో రేపటి నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సీఐఐ (CII) సమ్మిట్ ప్రారంభంకానుందని ఎంపీ చింతకాయల విజయ్ తెలిపారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ సీఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామన్నారు. దేశం మొత్తం మళ్లీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని.. దీనికంతటికీ కారణం ‘బ్రాండ్ సీబీఎన్’ అని చెప్పుకొచ్చారు. యువతకు భరోసానిస్తూ నిజమైన ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్’గా మంత్రి నారా లోకేశ్ నిలిచారన్నారు.
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిందని ఎంపీ విమర్శించారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ గతంలో జగన్ ప్రభుత్వం అంతా పచ్చి అబద్ధాలే చెప్పిందని మండిపడ్డారు. యువతను మోసం చేస్తూ యూట్యూబ్ ఛానళ్లు, అప్పడాలు, బొబ్బట్లు తయారీ కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. అప్పట్లో పరిశ్రమలను వెళ్లగొడితే... కూటమి పాలనలో పెట్టుబడులకు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు.
దేశంలోనే రికార్డు స్థాయిలో 25.3 శాతం పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా నిలిచిందని విజయ్ తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చామన్నారు. సింగిల్ డెస్క్ విధానం, పారదర్శక పాలనతో పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసాను మంత్రి లోకేశ్ కల్పిస్తున్నారని అన్నారు. ఇప్పటికే రూ.11 లక్షల కోట్ల ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశలో ఉన్నాయని... దాదాపు 15 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని స్పష్టం చేశారు. మొత్తం రూ. 26 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతోందన్నారు.
ఏపీలో 8.51 శాతం జీఎస్డీపీ నమోదు అయ్యిందని.. దేశంలోనే రెండో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ఎంపీ అన్నారు. ఉత్తరాంధ్రకు గూగుల్ ఏఐ హబ్, భోగాపురం ఎయిర్పోర్ట్... రాయలసీమలో ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ హబ్‌లు వచ్చాయన్నారు. అమరావతి నిర్మాణం పరుగులు పెడుతోందని, పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయని ఎంపీ చింతకాయల విజయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో రెండోసారి ‘భారత్ సమ్మిట్’.. ప్రపంచ పరిస్థితులపై చర్చలు: సల్మాన్ ఖుర్షీద్
నెల్లూరులో భూముల స్కాం.. మేకపాటి రాజగోపాల్‌పై కేసు నమోదు
Read Latest Telangana News And Telugu News