Share News

వైసీపీ సభ్యులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక సూచన

ABN , Publish Date - Aug 14 , 2026 | 08:27 PM

ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను ఆదేశించారు.

వైసీపీ సభ్యులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక సూచన
Andhra Pradesh Assembly

అమరావతి, ఆగస్టు 14: ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఏర్పాట్లు, భద్రతపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఉన్నతాధికారులతో కలిసి వారు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.


కీలక నిర్ణయాలు

డిజిటల్ నిఘా, భద్రత: సభా ప్రాంగణంలోకి వచ్చే సందర్శకులకు ఈసారి డిజిటల్ పాసులను జారీ చేయనున్నారు. గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద పాసుల స్కానింగ్ అనంతరమే అనుమతిస్తారు.

సభా వ్యవహారాలు: పెండింగ్ ప్రశ్నలకు సత్వరమే సమాధానాలు ఇవ్వాలని, సభా హామీల అమలుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పీకర్ దిశానిర్దేశం చేశారు. అలాగే సభ్యుల మెడికల్ బిల్లులు, పింఛను పెంపు ప్రతిపాదనలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

బీఏసీ సమావేశం: సభ ప్రారంభమైన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) భేటీ అయి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటుంది.


ప్రతిపక్ష వ్యాఖ్యలపై స్పీకర్ మండిపాటు:

సభకు హాజరుకాకుండా బయట ఉండి ప్రజాప్రతినిధుల నివాసాలపై మాజీ మంత్రి పేర్ని నాని చెడు వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని, అసెంబ్లీకి వస్తే డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు. సభకు రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదని, సమావేశాలకు హాజరయ్యాకే వేతనాలు తీసుకోవాలని సూచించారు.


ఇవి కూడా చదవండి...

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష

పాదగయ క్షేత్రానికి పవన్ సతీమణి.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Updated Date - Aug 14 , 2026 | 08:36 PM