Share News

Minister Parthasarathy: వైసీపీకి అమరావతి పాపమే శాపమైంది: మంత్రి పార్థసారథి

ABN , Publish Date - Jan 17 , 2026 | 03:46 PM

మాజీ సీఎం జగన్‌పై మంత్రి పార్థసారథి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల కోపానికి గురైన వైసీపీకి అమరావతి పాపమే శాపమైందని.. కేవలం 11 సీట్లకే పరిమితమైందని వ్యాఖ్యానించారు.

Minister Parthasarathy: వైసీపీకి అమరావతి పాపమే శాపమైంది: మంత్రి పార్థసారథి
Minister Kolusu Parthasarathi

అమరావతి, జనవరి 17: రాజధాని అమరావతి అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు(CM Chandrababu) పిలుపునకు 29వేల మంది రైతులు ముందుకు వచ్చి 33వేల ఎకరాల భూమిని రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారని, ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన అని మంత్రి అన్నారు. 2014లో అసెంబ్లీలో అమరావతికి మద్దతిచ్చిన జగన్ రెడ్డి.. 2019 ఎన్నికల ముందు అక్కడే ఇల్లు కట్టుకున్నానని ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చాక దానిని నాశనం చేయడం ఘోరమైన నమ్మకద్రోహమని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో జగన్ రెడ్డి ఐదేళ్లు కాలయాపన చేసి, ఒక్క రాజధానినైనా నిర్మించకుండా రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారని.. ఇది తుగ్లక్ పాలనకు సమానమని మంత్రి విమర్శించారు.


ప్రపంచ నగరాలన్నీ నదీ తీరాల్లోనే..

అమరావతిని ఎడారిగా, శ్మశానంతో పోల్చి, కమ్మరావతి - బ్రహ్మరావతి వంటి నీచమైన మాటలతో ప్రాంతీయ, కుల విద్వేషాలు రెచ్చగొట్టడంతో వైసీపీ రాజకీయాల స్థాయిని బయటపెట్టిందని పేర్కొన్నారు. న్యాయం కోసం శాంతియుతంగా ఉద్యమించిన రైతులు, మహిళలపై పోలీసులతో దౌర్జన్యం చేయించి ఉద్యమాన్ని అణచివేయాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించిందని మంత్రి ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజల కోపానికి గురైన వైసీపీకి అమరావతి పాపమే శాపమైందని.. కేవలం 11 సీట్లకే పరిమితమైందన్నారు. నదీ ఒడ్డున రాజధాని ఎందుకు అని ప్రశ్నించే జగన్‌కు.. లండన్, వాషింగ్టన్, కైరో వంటి ప్రపంచ నగరాలన్నీ నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందిన విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరమని మంత్రి వ్యాఖ్యానించారు.


అంతర్జాతీయ ప్రమాణాలతో...

ఒకప్పుడు.. సైబరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చి రాష్ట్ర భవిష్యత్తుకు దారి చూపిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డ్ నుంచి వేల కోట్ల నిధులు సమీకరించి అమరావతిలో పనులను వేగంగా ప్రారంభించిందని మంత్రి తెలిపారు. అమరావతిలో భూముల విలువ పెరగడం ద్వారా వచ్చే ఆదాయంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న స్పష్టమైన ఆర్థిక దృష్టితో ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు. 30 శాతం గ్రీన్ కవర్, 10 శాతం వాటర్ బాడీస్‌తో.. పర్యావరణానికి హానిలేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతోందని మంత్రి చెప్పారు.


జగన్.. అసెంబ్లీకి రా..

పీపీపీ(Public Private Partnership) విధానంలో పెట్టుబడులు పెడితే అరెస్ట్ చేస్తామని బెదిరించడం ద్వారా జగన్ పెట్టుబడిదారులను భయపెట్టి, గతంలో సోలార్ ఒప్పందాల రద్దుతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం తెచ్చారని పార్థసారథి ఆరోపించారు. జగన్‌కు నిజంగా ప్రజలపై ప్రేమే ఉంటే.. రాజధానిపై ఉన్న సందేహాలను అసెంబ్లీకి వచ్చి చర్చించాలి తప్ప, బయట ఉండి విష ప్రచారం చేయడం సరైన రాజకీయ ధోరణి కాదన్నారు. 2027-28 నాటికి అంతర్జాతీయ స్థాయి అమరావతిని, అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్

మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 04:09 PM