Share News

Sankranti Travel Rush: చిన్న సమస్యే.. కానీ సంక్రాంతి ప్రయాణికులకు నరకం..

ABN , Publish Date - Jan 11 , 2026 | 08:14 AM

వారం కిందట బందరులో జరిగిన జాతీయ రహదారుల సంస్థ అధికారుల సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ కంచికచర్ల బైపాస్ దగ్గర దెబ్బతిన్న రోడ్డు గురించి ప్రస్తావించారు. ఆ రోడ్డును సరిచేయకపోతే పండగకి సొంతూర్లకు వచ్చే వారితో ట్రాఫిక్ కష్టాలు కలుగుతాయని, తక్షణం మరమ్మతులు చేయాలని సూచించారు..

Sankranti Travel Rush: చిన్న సమస్యే.. కానీ సంక్రాంతి ప్రయాణికులకు నరకం..
Sankranti Travel Rush

అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. గత అనుభవాలు, అంచనాలు ఉన్నప్పటికీ నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించింది. దీంతో నందిగామ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డుపై శనివారం ప్రయాణికులు నరకం చవిచూశారు. గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిపేసి వేచి ఉండాల్సి వచ్చింది. అనారోగ్యంతో కొందరు, ఆకలితో మరికొందరు ట్రాఫిక్‌లో అల్లాడిపోయారు. మహిళలు మరింత ఇబ్బంది పడ్డారు. రూ.వేలల్లో ఖర్చుచేస్తే పూర్తయ్యే పనులు కూడా చేపట్టకుండా ఇబ్బందులకు గురిచేసిన అధికారులు, టోల్ ప్లాజాల నిర్వాహకులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


  • నందిగామ వై జంక్షన్ వద్ద అష్టకష్టాలు

  • కంచికచర్ల బైపాస్ దగ్గర సర్వీసు రోడ్డుకు గుంతలు

  • ఏడాదిన్నరగా ఎన్‌హెచ్ అధికారుల నాన్చుడు ధోరణి

  • ముందే అధికారులను హెచ్చరించిన ఎంపీ శివనాథ్

  • అయినా పట్టించుకోని ఎన్‌హెచ్ అధికారులు

  • శనివారం హైదరాబాద్ నుంచి వాహనాల రాక

  • గంటలకొద్దీ నిలిచిపోయిన ట్రాఫిక్‌తో కష్టాలు

  • క్రమబద్ధీకరించలేక పోలీసుల అవస్థలు

(ఆంధ్రజ్యోతి, నందిగామ): వారం కిందట బందరులో జరిగిన జాతీయ రహదారుల సంస్థ అధికారుల సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shivnath) కంచికచర్ల బైపాస్ దగ్గర దెబ్బతిన్న రోడ్డు గురించి ప్రస్తావించారు. ఆ రోడ్డును సరిచేయకపోతే పండగకి సొంతూర్లకు వచ్చే వారితో ట్రాఫిక్ కష్టాలు కలుగుతాయని, తక్షణం మరమ్మతులు చేయాలని సూచించారు. అయినా ఎన్‌హెచ్ అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో సంక్రాంతి (Sankranti) పండుగ కోసం శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ప్రయాణికులకు అనుకున్నట్లుగానే కంచికచర్ల దగ్గర చుక్కలు కనిపించాయి.


ట్రాఫిక్ భారీగా స్తంభించింది..

ఏడాదిన్నరగా నాన్చుడే... నందిగామ పట్టణంలోని వై జంక్షన్ సమీపంలో ఏడాదిన్నరగా బైపాస్ నిర్మాణ నులు నిలిచిపోయాయి. పనులు తుది దశకు చేరిన సమయంలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగింది. కాంట్రాక్టర్ పనులు నిలిపేశాడు. దీంతో అప్రోచ్ రోడ్లపై వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. హైదరాబాద్ - విజయవాడ మధ్య నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని మరొకరితోనైనా పనులు పూర్తి చేయించాల్సిన హైవే అధికారులు నిర్లక్ష్యంగా ఉండిపోయారు. ఫలితంగా అప్రోచ్ రోడ్డునే ప్రధాన రహదారిగా వినియోగిస్తున్నారు. వాహనాల తాకిడికి అప్రోచ్ రోడ్డుపై గుంతలుపడ్డాయి. దీంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. గత ఏడాది దసరాకు లక్షలాది వాహనాలు రావడంతో పలుమార్లు ట్రాఫిక్ నిలిచిపోయింది. నాటి మంచి నేటి వరకు అదే పరిస్థితి కొనసాగుతుందంటే హైవే అథారిటీ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


గుంతలు కూడా పూడ్చలేరా?

వాస్తవానికి వై జంక్షన్ వద్ద వాహనాలు నిలిచిపోవడానికి నిదానంగా ముందుకు పోవడానికి అప్రోచ్ రోడ్డుపై ఉన్న ఒకటి రెండు గుంతలే కారణం. కొద్దిపాటి నిధులు కేటాయించి వీటిని పూడ్చేస్తే ట్రాఫిక్ అంతమేర నిలిచిపోయేది కాదు. వంతెనపై ఒక చోట రెండు ఖానాల మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో కనీసం ఇసుక ఇస్తాలు వేసినా సరిపోయేది. అధికారులు, కాంట్రాక్టర్ కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.


కావాలనే చేశారా?

సంక్రాంతి ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వాహనాల రాకపోకల కోసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కాంట్రాక్టర్‌ను కోరినట్లు సమాచారం. దీనిపై స్పందించిన కాంట్రాక్టర్ హాస్యాస్పదమైన సమాధానం చెప్పినట్లు తెలిసింది. బిల్లుల విడుదలలో జాప్యం వల్లే పనులు నిలిపేశామని, పండగకి ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందులు పడితే.. బిల్లులు ఇచ్చే వారిలో చలనం వస్తుందని అన్నట్లు సమాచారం.


పోలీసులు ఉక్కిరిబిక్కిరి..

వై జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో డీసీపీ లక్ష్మీనారాయణ చొరవ తీసుకుని బైపాస్‌పై ఖానాల మధ్య ఉన్న గ్యాప్‌లో బస్తాలు వేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఏసీపీ తిలక్, సీఐ వైవీవీఎల్ నాయుడు, సిబ్బంది గంటల తరబడి రోడ్డుపై నిలబడి ఈ చర్యలు చేపట్టారు.


టోల్ బాదుడుపై ప్రయాణికుల కన్నెర్ర..

ప్రయాణంలో రోడ్ల వల్ల ఎటువంటి అసౌకర్యం ఎదురైనా అక్కడ టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని, రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ట్రాపిక్ నిలిచి ఇబ్బంది పడినా టోల్ ఎలా వసూలు చేస్తారని ప్రయాణికులు మండిపడ్డారు. కీసర టోల్ ప్లాజా వద్ద వసూళ్లు నిలిపేయాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..

దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 11 , 2026 | 08:35 AM