మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..
ABN , Publish Date - Apr 10 , 2026 | 06:55 PM
కడప జిల్లాలో విద్యార్థిని హత్య కేసుపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని హత్య అత్యంత బాధాకరమని మంత్రి అన్నారు.
కడప: జిల్లాలో విద్యార్థిని హత్య కేసు ఉదంతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓ బాలికను ప్రేమోన్మాది అత్యంత పాశవికంగా గొంతు కోసి హతమార్చడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై ఏపీ మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమపేరుతో బాలికను హత్య చేశాడని తెలుసుకుని ఆమె ఆవేదనకు గురయ్యారు. విద్యార్థిని హత్య అత్యంత బాధాకరమని మంత్రి అన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగిన బాలిక హత్యకు గురికావడం మనసును కలిచివేస్తోందని చెప్పారు. బాలిక కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
ఇంకెవరూ మహిళల వైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి మంత్రి సవిత భరోసా కల్పించారు. నిందితుడు ఎంతటి వాడైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహిళలు, బాలికల పట్ల ఉన్మాదుల్లా వ్యవహరిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. మహిళలపై సైకోల్లా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని ఆగ్రహించారు. కూటమిది మహిళా పక్షపాత ప్రభుత్వమని అన్నారు. యువత బాధ్యతతో మెలగాలని.. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. మగ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటన కడప జిల్లా ఖాజీపేట మండలంలో ఈరోజు జరిగింది. ఆంజనేయకోట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్, అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన బాలికను ప్రేమపేరుతో వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో గొంతు కోసి మరీ దారుణంగా హతమార్చాడు. హత్య అనంతరం గంటల వ్యవధిలోనే నిందితుడు వెంకటేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
వైసీపీ నేతలది గుంట నక్కల రాజకీయం: కేంద్ర మంత్రి రామ్మోహన్