ప్రపంచస్థాయికి ఎక్కిన గొడ్డలి పార్టీ నేరాలు: టీడీపీ ఎమ్మెల్సీ
ABN , Publish Date - May 06 , 2026 | 03:07 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. కిల్లర్, క్రిమినల్, మాఫియా పార్టీలకు అధ్యక్షుడని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అభివర్ణించారు.
అమరావతి, మే 06: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. కిల్లర్, క్రిమినల్, మాఫియా పార్టీలకు అధ్యక్షుడని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అభివర్ణించారు. ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేటివ్ ఛానల్ జావా డిస్కవర్ విడుదల చేసిన ప్లానెట్ కిల్లర్స్ ఫారెస్ట్ డిస్ట్రాయర్ డాక్యుమెంటరీలో వైసీపీ నేర చరిత్ర అంతా బయట పడిందని విమర్శించారు.
బుధవారం రాజధాని అమరావతిలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విలేకర్లతో మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ నేరాలు ప్రపంచ స్థాయికి ఎక్కాయన్నారు. వైఎస్ జగన్ అనుచరుడు.. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అరాచకాలు అన్నీ వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2003లో సీఎం నారా చంద్రబాబుపై అలిపిరి క్లేమోర్ మైన్ దాడిలో ఈ కొల్లం గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడని గుర్తు చేశారు.
వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అతడు ప్రధాన నిందితుడిగా ఉన్నారని చెప్పారు. అలాంటి వ్యక్తులతో వైఎస్ జగన్ అంటకాగుతున్నారని మండిపడ్డారు. 30 క్రిమినల్ కేసులు ఉన్న జగన్ రెడ్డి, 27 కేసులు ఉన్న కొల్లం గంగిరెడ్డి బెయిల్‌పై బయట తిరుగుతున్నారని వివరించారు. జగన్ సహవాసం అంతా ప్రపంచ స్థాయి స్మగ్లర్లు, నేరస్తులతోనే అని ఆమె వ్యంగ్యంగా అన్నారు.
సీఎం చంద్రబాబు ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తుంటే.. వైఎస్ జగన్ స్మగ్లర్లు, నేరస్తులతో చెట్టపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వాడే గొడ్డళ్లన్నీ ఇడుపులపాయి నుంచే వెళ్లాయని ఆరోపించారు. జగన్ రెడ్డి విజయవాడ, తాడేపల్లి వదిలి బెంగళూరులో కూర్చొని నేరాలు, ఘోరాలకు స్కెచ్‌లు వేస్తున్నట్లుగా తమకు అనుమానం కలుగుతోందన్నారు.
వైసీపీలో ఏ నాయకుడి వెనుక చూసినా నేర చరిత్ర ఉంటుందని పంచుమర్తి అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా చాలా మంది వైసీపీ నాయకుల నేర చరిత్రలు జావా డిస్కవర్‌లోకి వస్తాయని పేర్కొన్నారు. వైసీపీని గొడ్డలి పార్టీ అంటారా? అంటూ ఆ పార్టీకి చెందిన మహిళా నేత వాపోతోందన్నారు. వివేకానందరెడ్డిని గొడ్డలితో ఏడుసార్లు నరికి దారుణంగా హత్య చేశారని తెలిపారు. అలాంటి పార్టీని గొడ్డలి పార్టీ అనక మరేమంటారు? అని ఈ సందర్భంగా వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ చురకలంటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: సీతక్క
శ్రీసత్యసాయి జిల్లాలో హైవే దోపిడీ కేసులు.. ఏడుగురి అరెస్ట్
For More AP News And Telugu News