Share News

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి

ABN , Publish Date - Mar 28 , 2026 | 09:36 PM

ఉడాన్ పథకం ద్వారా ఏపీలోని కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి
Union Minister Rammohan Naidu

ఇంటర్నెట్ డెస్క్: ఉడాన్(UDAN) పథకం కింద ఏపీలోని కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు నడుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. అలాగే.. ఆదిలాబాద్, నాగార్జున సాగర్‌లో ఎయిర్‌స్ట్రిప్‌ల అభివృద్ధి కూడా చేస్తామన్నారు. సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తెచ్చేలా, ప్రాంతీయ అనుసంధానతను పెంచడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు.


అయితే.. ఉడాన్ పథకం విస్తరణ కింద 2026-27 నుంచి 2035-36 వరకు రూ.28,840 కోట్ల అంచనా వ్యయంతో సవరించగా.. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందులో కడప విమానాశ్రయ అభివృద్ధి కోసం రూ.606 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం నుంచి ఢిల్లీకి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా, వ్యాపార, పర్యాటక రంగాలను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.


'ఏపీ ప్రభుత్వం 9 సీ ప్లేన్ స్ట్రిప్స్ అడుగుతోంది. ప్రకాశం, శ్రీశైలం, పులికాట్, అరకు సహా పలు చోట్ల సీప్లేన్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని కోరుతోంది. ఉడాన్ 2.O పథకం పనులను మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని ఎయిర్‌పోర్టుల్లో 'ఉడాన్ యాత్రి కేఫ్‌'లు ప్రారంభమవుతాయి. ఇప్పటికే 13 ఎయిర్‌పోర్టుల్లో ఈ కేఫ్‌‌లు ఏర్పాటయ్యాయి. ఆదివారం నాడు గుజరాత్‌లో రాజ్‌కోట్‌ వేదికగా మరో 11 ఎయిర్‌పోర్టుల్లో 'ఉడాన్ యాత్రి కేఫేలు' ప్రారంభం కానున్నాయి. రాజ్‌కోట్, చండీగఢ్‌, ఇందోర్, జమ్మూ, పాట్నా, అమృతసర్, వారణాసి, గ్వాలియర్, అగర్తలా, జైపుర్, లఖ్‌నవూలలో 'ఉడాన్ యాత్రి కేఫేలు', 50 విమానాశ్రయాల్లో ఉచిత వైఫై సౌకర్యం ప్రారంభం కానున్నాయి. మరో 10 ఎయిర్‌పోర్టుల్లో కిడ్స్ జోన్, 16 ఎయిర్‌పోర్టుల్లో ఫ్లైబ్రరీ వసతి సౌకర్యాలు ప్రారంభిస్తున్నాం' అని రామ్మోహన్ నాయుడు వివరించారు.


ఇక.. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించామని కేంద్ర మంత్రి వివరించారు. జూన్ చివరి నాటికి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. అమరావతిలోనూ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి చర్యలు చేపడతామని. త్వరలో మామునూరు(వరంగల్)లోనూ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.


ఇవీ చదవండి:

అన్నాడీఎంకే స్థానాన్ని ఆక్రమించుకోనున్న విజయ్ టీవీకే

పాక్ ఇంకా ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇస్తోంది.. భారత్‌కు అమెరికా నివేదిక హెచ్చరిక..

Updated Date - Mar 28 , 2026 | 09:36 PM