Share News

షర్మిలపై సాక్షి కథనాన్ని ఖండించిన నారా లోకేశ్.. మహిళను కించపరిచేలా ఉందని వ్యాఖ్య

ABN , Publish Date - Nov 17 , 2026 | 08:10 PM

షర్మిల తన కుమార్తె వివాహానికి పెద్దలను ఆహ్వానించడం అనేది మర్యాద, సంస్కృతికి సంబంధించిన విషయమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబును షర్మిల ఆహ్వానించడంపై సాక్షిలోవచ్చిన కథనాన్ని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.

షర్మిలపై సాక్షి కథనాన్ని ఖండించిన నారా లోకేశ్.. మహిళను కించపరిచేలా ఉందని వ్యాఖ్య
AP Minister Nara lokesh

అమరావతి, నవంబర్17: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.. తన కుమార్తె వివాహానికి పెద్దలను ఆహ్వానించడం అనేది మర్యాద, సంస్కృతికి సంబంధించిన విషయమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తన కుమార్తె అంజలీ రెడ్డి వివాహానికి సీఎం చంద్రబాబు నాయుడును వైఎస్ షర్మిల స్వయంగా కలిసి ఆహ్వానించారని చెప్పారు. దీనిపై సాక్షి న్యూస్‌లో వచ్చిన కథనం ఒక మహిళను కించపరిచేలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఆక్షేపణీయమైనది, ఆమోదయోగ్యం కానిదని అన్నారు.


ప్రజా జీవితంలో బలమైన రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చని.. కానీ అది ప్రాథమిక విలువలను ఎప్పటికీ కోల్పోకూడదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై వ్యక్తిగత దాడికి తావు లేదని చెప్పారు. బాధ్యతారహితమైన కథనం ప్రచురించిన సాక్షిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ తెలిపారు.


జగన్ రెడ్డి ప్రమేయం లేకుండా రాయగలరా?: సోమిరెడ్డి

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె పెళ్లికి సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడంపై సాక్షి దారుణ రాతలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు. జర్నలిజం విలువలను పాటించడంలో సాక్షి నీచాతినీచంగా దిగజారిపోయిందని మండిపడ్డారు. తెలుగు జర్నలిజంలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. బద్ధ శత్రువులైనా పెళ్లిళ్లు, తదితర శుభకార్యాలకు పిలుచుకునే సంప్రదాయం ఉందని తెలిపారు. తాను తన కుమార్తె పెళ్లికి అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆహ్వానించానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన ఇంటికి తాను, తన కుమారుడు వెళ్లినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు.


సాక్షి వైఖరే చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడితో పాటు కూటమి ప్రభుత్వంపై ద్వేషంతో రాష్ట్రమే నాశనం కావాలని కోరుకోవడం దుర్మార్గమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాక్షి రాతల్లో కనీసం ఐదారు శాతం కూడా నిజం ఉండటం లేదని పేర్కొన్నారు. ఆ పత్రిక వైఖరి జర్నలిజానికే మాయని మచ్చగా నిలుస్తోందని అభివర్ణించారు. సాక్షికే కాదు...దానిని నడిపిస్తున్న వైఎస్ జగన్ రెడ్డికి విలువలు లేవని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా సాక్షిలో సొంత చెల్లెలుపై దారుణమైన రాతలు రాయగలరా.. అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వాటికి ఆయన బాధ్యత వహిస్తారా?.. లేక ఎడిటర్ బాధ్యుడవుతారా..? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమని అన్నారు. కానీ సొంత మేనకోడలి వివాహ ఆహ్వానాలను కూడా రాజకీయం చేసి నీచాతినీచమైన రాతలు రాయడం దుర్మార్గమైన చర్యగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల ప్రజలు జగన్‌ను ఓడించి జ్ఞానోదయం కలిగించారు: ఎమ్మెల్సీ వర్ల రామయ్య

షర్మిలపై సాక్షి కథనాన్ని ఖండించిన నారా లోకేశ్.. మహిళను కించపరిచేలా ఉందని వ్యాఖ్య

Updated Date - Nov 17 , 2026 | 08:58 PM