నీటిపారుదల శాఖ అధికారులపై మంత్రి నిమ్మల సీరియస్..
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:15 PM
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో అలసత్వంపై మంత్రి ఆగ్రహించారు. నియోజకవర్గాల వారీగా కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత పనుల అంచనాల తయారీపై అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో అలసత్వంపై మంత్రి ఆగ్రహించారు. నియోజకవర్గాల వారీగా కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత పనుల అంచనాల తయారీపై అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంచనాల తయారీపై ఇరిగేషన్ అధికారులు అలసత్వం ప్రదర్శించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే నెలల్లో చేయాల్సిన పనులకు సంబంధించి ఇంకెప్పుడు అంచనాలు రూపొందిస్తారని సీఈలను మంత్రి ప్రశ్నించారు.
గతంలో ఏప్రిల్, మేలో చేసే పనులకు జూన్‌లో అనుమతులు ఇచ్చేవారని.. గత ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా ఇప్పుడూ ప్రవర్తిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ఇరిగేషన్ అధికారులు ఇకనైనా తీరు మార్చుకోవాలని మంత్రి నిమ్మల హితవు పలికారు. ఆదివారం సాయంత్రంలోగా అంచనాలు సమర్పించాలని సీఈలకు ఆదేశాలు జారీ చేశారు. గడువులోగా అంచనాలు సమర్పించని సీఈలు సోమవారం నాడు అమరావతి సచివాలయానికి వచ్చి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికలు తీయకపోవడంతో సాగునీరందక గత ఐదేళ్ల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యవసర పనుల కింద నిధులు కేటాయించి, చివరి ఎకరం వరకూ సాగు నీరందించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో కాలువల మరమ్మతు పనులు చేపట్టామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశానికి ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీఈలు, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
తప్పుచేసే పోలీసులను ప్రశ్నించడం తప్పా: పేర్ని నాని
దేశం మొత్తానిది ఒక దారి.. వైసీపీది మరో దారి: సీఎం చంద్రబాబు