Share News

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా: మేయర్ రవీంద్ర

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:05 PM

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల పాలకవర్గ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పలు కార్పొరేషన్ల మేయర్లు స్పందించారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో  విషయాలు నేర్చుకున్నా: మేయర్ రవీంద్ర

గుంటూరు/విశాఖపట్నం, మార్చి 17: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. నగరంలోని 57 డివిజన్లను కులాలు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేశామన్నారు. నేటి(మంగళవారం)తో నగర పాలక సంస్థ పాలక వర్గం పదవీ కాలం ముగియనుంది.

ఈ నేపథ్యంలో మంగళవారం గుంటూరులో మేయర్ కోవెలమూడి రవీంద్ర విలేకర్లతో మాట్లాడుతూ.. కార్పొరేషన్ 10 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. పాలనా పరంగా తనకు ప్రతి ఒక్కరూ సహకరించారన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో రూ.200 కోట్ల పనులకు నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ పరిధిలో రూ.279 కోట్లతో అభివృద్ధి జరిగిందని వివరించారు.


రహదారులు, మురికి కాలువలపై దృష్టి సారించి వాటిని పూర్తి చేశామని రవీంద్ర తెలిపారు. మూడో ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్డు‌ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారికి తాను మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నష్ట పరిహారాన్ని చెల్లించామన్నారు. మార్చి 31 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కొల్లి శారదా మార్కెట్ టెండర్లలో చరిత్ర సృష్టించామని ఆయన గుర్తు చేశారు.


చిత్తశుద్ధితో పని చేస్తా: పీలా శ్రీనివాసరావు

రేపటి (బుధవారం) నుంచి నిత్యం ప్రజల్లో ఉంటానని విశాఖపట్నం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. సీఎం చంద్రబాబు ఎటువంటి బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు. నగర మేయర్‌గా 11 నెలల పాటు తనకు సేవచేసే అవకాశం కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు చెప్పారు. నగర పాలక సంస్థ మేయర్‌గా పదవీ కాలం నేటి(మంగళవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పీలా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ.. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, జీవీఎంసీ ప్రతిపక్ష నేతగా తాను నాలుగేళ్ల పాటు పని చేశానన్నారు.


టీడీపీ తరఫున తొలి జీవీఎంసీ మేయర్‌ తనేనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు శ్రీనివాసరావు. మేయర్‌గా పనిచేసే అవకాశం తనకు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన హయాంలో రూ.760 కోట్ల అభివృద్ధి పనులు చేశానని వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే విధంగా రహదారులను అభివృద్ధి చేశానని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని.. ఈ ముగ్గురికి ప్రథమ పౌరుడిగా తనకు స్వాగతం పలికే గొప్ప అవకాశం కలిగిందని గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా ముచ్చటించిన క్షణాలు తనకు మంచి జ్ఞాపకంగా నిలిచాయని పీలా శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దివ్యాంగ శక్తి పథకం ప్రారంభానికి సర్వం సిద్ధం

కొత్త అమావాస్య వేళ.. పొరపాటున కూడా ఇలా చేయవద్దు?

For More AP News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 02:36 PM