దివ్యాంగ శక్తి పథకం ప్రారంభానికి సర్వం సిద్ధం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:00 PM
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ తీసుకు వచ్చిన స్త్రీ శక్తి పథకం విజయవంతమైంది. తాజాగా రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది.
అమరావతి, మార్చి 17: ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ తీసుకు వచ్చిన స్త్రీ శక్తి పథకం విజయవంతమైంది. తాజాగా రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ పథకాన్ని రేపు అంటే బుధవారం.. ఉగాది పండగ కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొనున్నారు.
ఈ పథకం ప్రారంభించిన తర్వాత.. దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్, మాధవ్ తదితరులు ఆ బస్సులో ప్రయాణించనున్నారు. అనంతరం దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులతో కలిసి వారు ప్రయాణించనున్నారు. ఆ తర్వాత దివ్యాంగులతో కలిసి ప్రజా ప్రతినిధులు భోజనం చేయనున్నారు.
ఉగాది కానుకగా..
రాష్ట్రంలోని 11.16 లక్షల మంది దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులతోపాటు వారి వెంట వచ్చే సహాయకులకు లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి 50 శాతం టిక్కెట్ రాయితీని ఈ పథకం ద్వారా కల్పించనుంది.
స్త్రీ శక్తి బస్సుల్లో దివ్యాంగులు..
40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ పథకం వర్తించనుంది. 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ఈ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రభుత్వం విస్తరించింది. ఈ పథకం అమలు కోసం ఏడాదికి రూ.207 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. స్త్రీ శక్తి బస్సుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించింది.
స్త్రీ శక్తి పథకం ద్వారా..
ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ద్వారా 52 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1,826 కోట్లకుపైగా ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. డిసెంబర్ 3వ తేదీ దివ్యాంగుల దినోత్సవం. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్య పథకాన్ని చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉగాది పండగకు ఒక రోజు ముందు ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొత్త అమావాస్య వేళ.. పొరపాటున కూడా ఇలా చేయవద్దు?
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
For More AP News And Telugu News