శుభవార్త.. బహ్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు షురూ!
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:20 PM
బహ్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులకు గొప్ప శుభవార్త. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా బహ్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని భారత్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే..
అమరావతి: బహ్రెయిన్‌లో(Bahrain) చిక్కుకు పోయిన భారతీయులకు గొప్ప శుభవార్త. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా బహ్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని భారత్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన దాడుల నేపథ్యంలో గల్ఫ్‌లో విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. దీంతో బహ్రెయిన్ లో భారతీయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో డీజీసీఏ, పౌర విమానయాన శాఖ అధికారులతో ఏపీ భవన్ (AP Bhavan) అధికారులు చర్చించిన అనంతరం గల్ఫ్ ఎయిర్ సంస్థ(Gulf Air Evacuation Flights) విమాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రతిరోజూ 58 మంది తెలుగు వారిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురానున్నట్లు గల్ఫ్ ఎయిర్ విమాన సంస్థ పేర్కొంది. విమాన సర్వీసులకు సంబంధించిన సమాచారాన్ని ఏపీ భవన్ అధికారులు బహ్రెయిన్‌లో ఉన్న తెలుగు సంఘం ప్రతినిధులు రాధాకృష్ణ, రఘునందన్‌లకు అందించారు. బుధవారం 138 మందితో ముంబైకి మరో విమానం చేరుకోనుంది.
టికెట్లు కొనుగోలు చేసేందుకు బహ్రెయిన్‌లో తెలుగు సంఘం, భారత రాయబార కార్యాలయం(Embassy of India) ద్వారా ఏర్పాట్లు చేసింది గల్ఫ్ ఎయిర్ సంస్థ. గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). ఈ నేపథ్యంలోనే బహ్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం, తెలుగు సంఘం ప్రతినిధులు, డీజీసీఏ అధికారులు, పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి, బాధితులను భారత్‌కు తీసుకువచ్చే ఏర్పాట్లు చేసినట్లు ఏపీ భవన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్పెషల్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. బహ్రెయిన్ నుంచి విమాన సర్వీసులకు అనుమతి లేకపోవడంతో టికెట్లు బుక్ చేసుకున్న వారిని బస్సుల్లో సౌదీకి తరలిస్తున్నారు తెలుగు సంఘం ప్రతినిధులు, రాయబార కార్యాలయం అధికారులు. ఇక సౌదీలోని ‘దమమ్ ఎయిర్ పోర్ట్’ నుంచి విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గల్ఫ్ ఎయిర్ విమాన సంస్థ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
డేటింగ్ యాప్‌లో పరిచయం.. స్నేహమంటూ దగ్గరై 51 ఏళ్ల వ్యక్తిని
Read Latest Telangana News and National News