గోదావరి పుష్కరాలపై ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు..
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:11 PM
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన 2027 గోదావరి పుష్కరాలపై క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ(గురువారం) సచివాలయం 5వ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు..
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన 2027 గోదావరి పుష్కరాలపై (Godavari Pushkaralu) క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ(గురువారం) సచివాలయం 5వ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐదు అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. గత భేటీలోని అంశాలు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖలు రూపొందించిన పీపీటీలు, మంత్రుల సలహాలు, సూచనలు తదితర అంశాలపై చర్చించింది. మహా కుంభమేలా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని క్యాబినెట్ సబ్ కమిటీ భావించింది.
8 నుంచి 10 కోట్ల మంది ఈ పుష్కరాలకు వస్తారని క్యాబినెట్ సబ్ కమిటీ అంచనా వేస్తోంది. 2027 జూన్ 26వ తేదీ నుంచి జులై 7వ తేదీ వరకు జరిగే గోదావరి పుష్కరాలను 6 జిల్లాలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 4516 మీటర్ల మేర 373 ఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలకు అంచనా వేసింది. గతంలో ఉన్న 234 ఘాట్ల సంఖ్య పెంపునకు చర్యలు చేపట్టింది. పుష్కరాల ప్రధాన రోజుల్లో(తొలి, వీకెండ్, అమావాస్య) దాదాపు కోటి మంది వస్తారని అంచనా వేసింది. పవిత్ర స్నానానికి 2.25 కోట్ల మంది వస్తారని అంచనా వేసింది. భక్తుల సౌకర్యార్థం పిండ ప్రదానం ఘాట్లు, శానిటేషన్ ప్రక్రియ, రోడ్లు, వాటర్ తదితర విషయాల్లో పక్కా ప్రణాళిక ఉండాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
సాధారణ ధరలకే టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌తో క్యాబినెట్ సభ కమిటీ చర్చించింది. ఈస్ట్ గోదావరిలో 102 ఘాట్లు, వెస్ట్ గోదావరి 40, కోనసీమ 175, ఏలూరు 36, కాకినాడ 5, పోలవరం జిల్లాలో 11 ఘాట్లు.. మొత్తంగా 369 ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో మొదటి గోదావరి పుష్కర ఘాట్ పోలవరం జిల్లాలో గుండాల, చివరి ఘాట్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది, బలుసుతిప్ప, కాకినాడలో గోవలంక ఘాట్, వెస్ట్ గోదావరిలో నర్సాపురం ఘాట్ అని కమిటీ వెల్లడించింది. భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణయం తీసుకుంది. శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలవరం - నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం: సీఎం చంద్రబాబు
డయేరియా ప్రబలకుండా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
Read Latest Telangana News And AP News And Telugu News