Share News

Andhra Pradesh: నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:34 PM

ఇటీవల నదుల అనుసంధానం, రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ విమర్శలు చేశారు. జగన్ చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు నాగరికతను జోడిస్తూ కౌంటర్ ఇచ్చారు.

Andhra Pradesh: నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు
Chandrababu counter to Jagan

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును మరోసారి తప్పుబట్టారు సీఎం చంద్రబాబు. నదులు ఎక్కడ పుడతాయో, నాగరికత ఎక్కడ మొదలైందో జగన్ కి తెలియదని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కు కనీసం సింధూ నాగరికత గురించి కూడా అవగాహన లేదని మండిపడ్డారు. నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు నదీతీరాల వెంబడి ఉన్నందునే అభివృద్ధి చెందాయని అన్నారు. అంతేకాదు లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలు నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలు బుద్ధి చెప్పినా.. రాజధానిపై ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉన్నారని జగన్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు.


'ఏపీలో రానున్న రెండేళ్లలో నీటి కొరత లేకుండా ప్రణాళికలు రూపొందించాం. దేశంలోనే ఉద్యానవన రంగంలో అగ్రస్థానంలో ఉన్నాం. రానున్న పదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్‌-1గా నిలుస్తాం. దేశంలో ప్రతి రాష్ట్రం మనల్ని చూసి నేర్చుకునేలా ముందుకు సాగుతాం. నీటి విషయంలో గొడవలకు పోతే నష్టపోయేది తెలుగు ప్రజలే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనుకోవడం తప్పా?. మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్న విషయం ఆయనకి అర్థం కావడం లేదు. రాయలసీమకు నీరు అందించామనడానికి పట్టిసీమే ప్రత్యక్ష ఉదాహరణ. పట్టిసీమ ద్వారా రాయలసీమపై మాకున్న చిత్తశుద్ధిని చాటుకున్నాం. అందుకే ప్రజలు మా పాలన కోరుకున్నారు.


పట్టిసీమ వల్లే రాయలసీమలో ఉద్యానరంగం అభివృద్ధి పూర్తి చేయకుండా 2020లోనే నిలిపివేశారు. రాయలసీమ లిఫ్ట్‌ పేరుతో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు క్లయిమ్ చేసుకున్నారంటే ఆ ప్రభుత్వంలో దోపిడి ఏ విధంగా జరిగిందన్న విషయం ప్రజలు గమనించారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చే సత్తా మాకుంది. తెలంగాణతో మాకు ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటాం. రాజకీయాల కోసం సెంటిమెంట్లు రెచ్చగొట్టం' అని సీఎం చంద్రబాబు చెప్పారు.


ఇవి కూడా చదవండి...

విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాజ్‌ కసిరెడ్డి..

వైసీపీ పాలనలో అవినీతికి సాక్ష్యం ఇదే: మంత్రి సుభాశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 07:02 PM