Vasanmsetti Subhash: వైసీపీ పాలనలో అవినీతికి సాక్ష్యం ఇదే: మంత్రి సుభాశ్
ABN , Publish Date - Jan 10 , 2026 | 03:19 PM
వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తలనీలాల స్కామ్, పరాకామణి దోపిడి వంటి కోట్ల రూపాయల అవినీతి పనులు జగన్ రెడ్డి హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు.
అమరావతి, జనవరి 10: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైసీపీ పాలనలో భక్తి కేంద్రం నుంచి వ్యాపార కేంద్రంగా మార్చిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని మంత్రి వాసంశెట్టి సుభాశ్ (Minister Vasamsetti Subhash) విమర్శలు గుప్పించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. దేవుడంటే భయం- భక్తి లేని వ్యక్తులను టీటీడీ ఛైర్మన్, సభ్యులుగా నియమించి దర్శనాలను కమర్షియల్‌గా మార్చిన దుస్థితి జగన్ హయాంలోనే జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదేశాలతో వీఐపీ దర్శనాలను గణనీయంగా తగ్గించి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు.
ముక్కోటి ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చినా ఎక్కడా అపశృతి జరగకుండా ప్రశాంతంగా ఉత్తర ద్వార దర్శనం నిర్వహించడం కూటమి ప్రభుత్వ పరిపాలనకు నిదర్శమని మంత్రి వాసంశెట్టి వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణలో బంగారం, నగదు సీజ్ కావడం వైసీపీ పాలనలో జరిగిన అవినీతికి సాక్ష్యమని అన్నారు. తిరుమలలో ఖాళీ బాటిళ్లు పెట్టించి, సాక్షి విలేకరుల ద్వారా అల్లకల్లోలం సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ద్రాక్షారామం, కపిలేశ్వర ఆలయ ఘటనల్లోనూ శాస్త్రయుక్తంగా జరిగిన పునఃప్రతిష్టలను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం వైసీపీ చేసిందని మంత్రి మండిపడ్డారు. తలనీలాల స్కామ్, పరాకామణి దోపిడి వంటి కోట్ల రూపాయల అవినీతి పనులు జగన్ రెడ్డి హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఫీడ్ బ్యాక్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, జియో ట్యాగింగ్ వంటి చర్యలతో భక్తుల భద్రత, ఆలయ పవిత్రతను కాపాడుతున్నామని మంత్రి వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..
విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాజ్ కసిరెడ్డి..
Read Latest AP News And Telugu News