అమరావతి పర్యాటక అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం
ABN , Publish Date - Nov 27 , 2026 | 09:15 PM
ఈరోజు (శుక్రవారం) అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో పర్యాటక అభివృద్ధిపై ఏపీ సీఆర్డీఏ కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
అమరావతి, నవంబర్ 27: ఈరోజు (శుక్రవారం) అమరావతి ఎకనామిక్ రీజియన్ (AER) పరిధిలో పర్యాటక అభివృద్ధిపై ఏపీ సీఆర్డీఏ (APCRDA) కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన భేటీలో పర్యాటక రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనపై విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ పాల్గొన్నారు. అలాగే సీఆర్డీఏ అదనపు కమిషనర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ వి. సునీత, హోటల్స్ అసోసియేషన్, టూరిజం ప్రతినిధులూ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి, నాగార్జునకొండ, భట్టిప్రోలు, గుంటుపల్లిని కలుపుతూ ప్రత్యేక బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ఏర్పాటుపై అధికారులు ప్రతిపాదనలు చేశారు. కృష్ణా నది తీరంలో బోటింగ్, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్, ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత, పెడన కలంకారీ వంటి జీఐ (GI) ట్యాగ్ ఉత్పత్తులను పర్యాటకంతో అనుసంధానం చేయడంపై చర్చించారు.
ఈ సందర్భంగా స్థానిక కళాకారులు, చేనేత కార్మికుల ప్రోత్సాహం, అమరావతి ఆర్టిసన్ విలేజ్, మంగళగిరి చేనేత గ్రామాల ఏర్పాట్లపై చర్చ నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ కోసం రాజధానిలో MICE టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చర్చలు పాల్గొన్న అధికారులు సూచించారు. పర్యాటకులు ఎక్కువ రోజులు గడిపేలా కొత్త ప్యాకేజీల రూపకల్పన చేయాలని ప్రతిపాదనలు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన సూచనలను అమరావతి ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్లో చేర్చనున్నట్లు అధికారుల వెల్లడించారు. కాగా 2023లో AER పరిధిలో 5.74 కోట్ల పర్యాటక సందర్శనలు నమోదయ్యాయి.
ఈ వార్తలూ చదవండి
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
ప్రముఖ విద్యావేత్త డా. మంగాదేవి కన్నుమూత.. మంత్రి నారా లోకేశ్ సంతాపం!