గత పాలకుల పనులు చూసి నాకే మతిపోయింది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:07 PM
వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విభజన కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని.. దారిలో పెడుతున్నామని వెల్లడించారు.
బాపట్ల, ఏప్రిల్ 9: సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని.. నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలిపారు. గురువారం భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో పర్యటించిన సీఎం.. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 21 నెలల్లోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ఎన్నికల్లో చెప్పనివి కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సీఎం విమర్శించారు.
ఆస్తి మీది.. ఫోటో ఆయనది..
విభజన కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో మహిళలకు రక్షణ లేదన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని.. దారిలో పెడుతున్నామని వెల్లడించారు. వైసీపీ హయాంలో ప్రజల భూములపై కన్నేశారని.. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో భూ వివాదాలకు తెరలేపారని మండిపడ్డారు. ‘పట్టా పుస్తకంపై జగన్ ఫొటో వేసుకున్నారు.. ఆస్తి మీది.. ఫొటో ఆయనది’ అని విమర్శించారు. ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గత పాలకులు చేసిన పనులు చూసి తనకే మతిపోయిందని సీఎం అన్నారు. నూటికి 90శాతం రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు వచ్చేవన్నారు.
పాస్ పుస్తకాలను తారుమారు చేయలేరు..
ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతినెలా 9న ఒక ప్రాంతంలో రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తామని.. జులై నాటికి 9 లక్షల పాస్ పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు. 2027 మార్చి నాటికి కోటి 12లక్షల పాస్ పుస్తకాలు అందిస్తామని వెల్లడించారు. ఎవరూ ట్యాంపర్ చేయలేని విధంగా రికార్డులు మారుస్తున్నామని చెప్పారు. రైతులకు ఇస్తున్న పాస్ పుస్తకాలను ఎవరూ తారుమారు చేయలేరన్నారు. కరెన్సీకి వాడే టెక్నాలజీని పట్టాదారు పాస్ పుస్తకాలకు వాడామని తెలిపారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశామని సీఎం తెలిపారు. 22ఏ నుంచి మీ భూములు తొలగిస్తామని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. భూ రిజిస్ట్రేషన్ల పద్ధతిలో కూడా మార్పులు తీసుకొస్తామన్నారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాకూడదని సీఎం అన్నారు.
ప్రజా రాజధాని.. దేవతల రాజధాని.. అమరావతి
సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. భూమి నుంచి వచ్చే ఆదాయమే కాకుండా.. సముద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేసిందని.. ప్రతి దానిపైనా అప్పులు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోయిందన్నారు. ఆనాడు హైదరాబాద్‌ను డెవలప్ చేశానని.. ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్నీ ఆలోచించే రాజధానికి అమరావతి పేరు పెట్టానని స్పష్టం చేశారు. ‘ప్రజా రాజధాని.. దేవతల రాజధాని.. అమరావతి’ అని పేర్కొన్నారు.
అమరావతి ఆగదు...
ఆనాడు బాబాయ్‌ని చంపి.. ఆ నేరం తనపై వేశారని సీఎం మండిపడ్డారు. అమరావతిపై జగన్ కక్షగట్టారని.. ఆనాడు ఆడబిడ్డలను వేధించారన్నారు. డ్రోన్లతో ఆడబిడ్డలను వీడియోలు తీశారని, లాఠీలతో కొట్టించారని గుర్తుచేశారు. అమరావతి విషయంలో న్యాయం, ధర్మం, చట్టం గెలిచిందన్నారు. ప్రాంతాలు, కులాలతో రాజకీయం చేస్తే గెలవలేమని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు జగన్ ఒక్కడే సైకో అనుకున్నామని.. వైసీపీ నేతలంతా సైకోలుగా మారారని వ్యాఖ్యానించారు. ‘నీలాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు’ అని స్పష్టం చేశారు. అధికారంలో ఉంటే విధ్వంసం చేశారని... ప్రతిపక్షంలో ఉంటే బెదిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటే.. దాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి...
ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎదుట ఆందోళన.. అంబటి రాంబాబుపై కేసు నమోదు
రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News