అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావద్దు: విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ
ABN , Publish Date - Apr 30 , 2026 | 07:25 PM
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఒక వైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
అమరావతి, ఏప్రిల్30: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఒక వైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. శుక్రవారం(మే1వ తేదీ) పలు జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రాబోయే 3 రోజులు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడ వద్దని ప్రజలకు స్పష్టం చేశారు. గురువారం మార్కాపురం జిల్లా పొదిలిలో 37మిమీ, ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కలలో 22మిమీ, నంద్యాల జిల్లా మెట్టుపల్లిలో 10.5 మిమీ వర్షపాతం నమోదయిందని వివరించారు.
మరో వైపు పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు. నెల్లూరు జిల్లా గూడూరులో 45.8°C ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని చెప్పారు. పల్లాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2°C, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45°C ఉష్ణోగ్రతలు నమోదయిందని వివరించారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 216 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలిపారు. పల్నాడు 28, వైఎస్సార్ కడప 26, తిరుపతి 25 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉందన్నారు.
శుక్రవారం(మే 1వ తేదీ) 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైలు తెలిపారు. మరో 49 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వివరించారు. పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లో తీవ్ర వడగాలుల ముప్పు పొంచి ఉందన్నారు. విజయనగరం, పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని చెప్పారు.
ఎండ తీవ్రత, ఉక్కపోత నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. అవసరం లేకుండా మధ్యాహ్నం వేళ.. ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. కర్ణాటక నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ప్రభావం కారణంగా ఈ పరిస్థితులు ఉత్పన్నమైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదవ తరగతి ఫలితాలు విడుదల.. స్పందించిన సీఎం చంద్రబాబు
ఏసీబీకి చిక్కిన బిల్లు కలెక్టర్.. సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ముగిసిన సోదాలు
Read Latest AP News And Telugu News