పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచే అభ్యర్ధులనే గెలిపించాలి: ప్రజలకు కూటమి నేతలు పిలుపు
ABN , Publish Date - Nov 18 , 2026 | 03:00 PM
ఇప్పటి వరకూ జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి పట్ల చూపిన స్ఫూర్తినే పంచాయతీ ఎన్నికల్లోనూ చూపించాలని ప్రజలకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
అమరావతి, నవంబర్18: ఇప్పటి వరకూ జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి పట్ల చూపిన స్ఫూర్తినే పంచాయతీ ఎన్నికల్లోనూ చూపించాలని ప్రజలకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూటమిలోని పార్టీల అగ్రనేతలు నాదెండ్ల మనోహర్, పీవీఎన్ మాధవ్‌తో కలిసి పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచే అభ్యర్ధులనే గెలిపించాలని వారిని వీరు కోరారు.
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో ఘన విజయం ద్వారా ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌ను పరుగులెత్తిస్తామని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీ దుర్మార్గాలన్నింటినీ అడ్డుకున్నామని స్పష్టం చేశారు. పులివెందులలో తొలిసారి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు వివరించారు.
ఆ స్ఫూర్తి పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగాలి: మంత్రి మనోహర్
మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తి పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగాలని జనసేన పార్టీ నేత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. కూటమి ఐక్యత కొనసాగేలా జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని వివరించారు. సమాజానికి మేలు చేయాలని వచ్చే యువతకు కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ప్రజలంతా మనస్ఫూర్తిగా కూటమిని పంచాయతీ, రెండో దశ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశీర్వదించి గెలిపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.
స్పష్టమైన తీర్పిచ్చిన ప్రజలు: ఏపీ బీజేపీ చీఫ్
స్థానిక సంస్థల ఎన్నికల మధ్యలో మూడు తుపాన్లు రాష్ట్రాన్ని ముంచెత్తినా ప్రజలకు స్పష్టంగా తీర్పునిచ్చారని బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇప్పటి వరకూ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. సేవా సంకల్ప్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాలనకు నిదర్శనంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ఇవ్వన్నీ బేరీజు వేసుకుని రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు మంత్రి నాదెండ్ల విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనకాపల్లి జిల్లాలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేతలు
ఏపీ సెమీకండక్టర్ పాలసీకి ఆమోదం.. ఫ్యాబ్‌లకు 80 శాతం పెట్టుబడి రాయితీ
Read Latest AP News And Telugu News