Share News

ఏపీ సెమీకండక్టర్ పాలసీకి ఆమోదం.. ఫ్యాబ్‌లకు 80 శాతం పెట్టుబడి రాయితీ

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:23 PM

సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీకి ఆమోదం తెలిపింది. సిలికాన్ ఫ్యాబ్‌లకు 80 శాతం వరకు పెట్టుబడి రాయితీ కల్పించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

ఏపీ సెమీకండక్టర్ పాలసీకి ఆమోదం.. ఫ్యాబ్‌లకు 80 శాతం పెట్టుబడి రాయితీ
AP Semiconductor Policy

అమరావతి, నవంబర్ 18: సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీకి ఆమోదం తెలిపింది. సిలికాన్ ఫ్యాబ్‌లకు 80 శాతం వరకు పెట్టుబడి రాయితీ (క్యాపిటల్ సపోర్ట్) కల్పించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనుందని తెలిపారు. ఈ మేరకు సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0లో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో నం.87ను జారీ చేసింది. తిరుపతిలో 5,000 ఎకరాల్లో భారీ ‘ఏపీ సెమీకండక్టర్ పార్క్’ ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించనున్నారు. భారత్‌కు అవసరమైన చిప్‌లను ఆంధ్రప్రదేశ్‌లోనే తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.


దేశంలోనే అత్యధికంగా 80 శాతం రాయితీ

కేంద్రం ప్రకటించిన ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’కు అనుగుణంగా ఏపీ పాలసీని రూపొందించారు. దీని ప్రకారం సిలికాన్ ఫ్యాబ్‌లకు కేంద్రం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున మొత్తం 80 శాతం క్యాపిటల్ సపోర్ట్ అందించనున్నాయి. కాంపౌండ్ సెమీకండక్టర్, ఫోటోనిక్స్, డిస్‌ప్లే ఫ్యాబ్, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్ యూనిట్లకు 70 శాతం వరకు, లెగసీ ప్యాకేజింగ్ యూనిట్లకు 50 శాతం వరకు పెట్టుబడి ప్రోత్సాహకాలు కల్పించనున్నారు. దేశంలోనే అత్యధికంగా 80 శాతం రాయితీ ఇస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. ఒడిశా 65 శాతం, తమిళనాడు 65 శాతం, గుజరాత్ 56 శాతం వరకు రాయితీలను అందిస్తున్నాయి.


తిరుపతి సెమీకండక్టర్ పార్క్‌లో 3 కొత్త సంస్థలు

తిరుపతిలో 5,000 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ పార్క్‌లో క్లీన్‌రూమ్స్, అల్ట్రా ప్యూర్ వాటర్, నిరంతర విద్యుత్ సరఫరా, టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పెట్టుబడిదారులకు సింగిల్ విండో అనుమతుల కోసం సీఎం నేతృత్వంలో ‘APSGIC’ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఐఐటీ తిరుపతి వేదికగా ‘ఏపీ సెమీకండక్టర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (AP-SRIC)’ను ప్రారంభించనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు ‘AP-STCC’ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొందే ఒక్కో ట్రైనీకి నెలకు రూ.10,000 చొప్పున ఆరు నెలల పాటు కంపెనీలకు శిక్షణ రాయితీ కల్పించనున్నారు.


స్టార్టప్‌లు, మెగా ప్రాజెక్టులకు అదనపు ప్రోత్సాహకాలు

చిప్ డిజైన్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూ.22.5 కోట్ల వరకు సీడ్ ఫండింగ్ (ఏపీ వాటా రూ.7.5 కోట్లు) అందించనున్నారు. యంత్రాలు, మెటీరియల్స్ కొనుగోలుపై కేంద్రం 30 శాతం, రాష్ట్రం 18 శాతం చొప్పున మొత్తం 48 శాతం సాయం అందించనున్నాయి. రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటయ్యే మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు ప్రత్యేకంగా రూపొందించిన ప్యాకేజీలను అమలు చేయనున్నారు. ‘సెమికాన్ 2.0’ పరిధిలోకి రాని ప్రాజెక్టులకు ఐదేళ్ల పాటు యూనిట్ విద్యుత్‌కు రూ.3 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. నూతన సెమీకండక్టర్ పాలసీ రాబోయే ఐదేళ్ల పాటు అమలులో ఉండనుంది. రూపాయికి రూపాయి మ్యాచింగ్ సపోర్ట్‌తో దేశంలోనే అత్యంత చౌకగా ఫ్యాబ్‌ల నిర్మాణానికి అవకాశం కల్పించడమే లక్ష్యమని మంత్రి లోకేశ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

పులివెందులలో ఉద్రిక్తత.. పలుచోట్ల వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు

నందికొట్కూరు ఎంపీపీ ఎన్నికలపై ఉత్కంఠ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 02:37 PM